పుణ్యశ్లోక అహిల్యాబాయి 300వ జయంతి ఉత్సవాలు జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో సెప్టెంబర్ 1 ఆదివారం మెట్టుపల్లి విఆర్ఎం గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. మాజీ గవర్నర్ శ్రీ సి హెచ్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సోదర భావం అనే పదం రాజ్యాంగ పీఠికలో చేర్చి, దేశ సమైక్యతకు గట్టి పునాది వేసిన ఘనత డా. బిఆర్ అంబేద్కర్‌దని ఆయన తెలిపారు. కులవివక్షత, అంటరానితనం లేని సమాజ నిర్మాణం కోసం అందరూ పాటు పడాలని, నిమ్న వర్గాల ప్రజలను కూడా సామాజిక కార్యంలో భాగస్వాములను చేయాలని, మహిళలు అన్ని కులాల మహిళలను పసుపు బొట్టుతో గౌరవించటం మన సంప్రదాయం కావాలని విద్యాసాగర్ అభిలషించారు.
గొర్రెలు, మేకలు పెంచుకునే కుటుంబాల్లో జన్మించి, రాజవంశంలో ప్రవేశించి, ఉత్తమ పాలన అందించిన ప్రతిభావంతురాలు అహిల్యాబాయి హోల్కర్ అని, వితంతువు అయినప్పటికీ దేశంలో ఆమె 100 దేవాలయాల పునర్నినిర్మాణం గావించడమేగాక, ప్రజల బాధలు విని, సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఈ మహిళామణి అందరికీ ఆదర్శమని మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ రుక్మిణి తెలిపారు. 1983లో ప్రారంభం అయిన సమరసత పని నేడు అన్ని రాష్ట్రాలకూ విస్తరించిందని రాష్ట్ర అధ్యక్షులు రేశ్ బాబు పేర్కొన్నారు. మహానుభావులు అన్ని కులాల్లోనూ జన్మించి, సమరసత భావం కోసం పాటు పడ్డారని, అందరికీ దేవాలయంలో ప్రవేశం, అందరికీ గృహ ప్రవేశం కల్పించడం వల్ల సమరసత భావం వెల్లి విరుస్తుందని అప్పాల ప్రసాద్ చెప్పారు.
ఈ సందర్భంగా మలయాళ స్వాముల వారి జీవితం, వారు ప్రవచించిన సూక్తుల పుస్తకం, సమరసత క్యాలెండర్ సైజ్ ఫోటోల ఆవిష్కరణ జరిగింది. సమరసత సమ్మేళనం కమిటీ కన్వీనర్ బెజ్జరపు మురళీ, కో కన్వీనర్లు తుకారామ్ నిర్వహణ చేశారు. సమరసతమూర్తుల క్యాలెండర్ ఫోటోలు ఇళ్లల్లో గోడలకు తగిలించుకోవడానికి వీలుగా 1000 మందికి చిత్ర పటాలు అందించారు.
ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు లెక్కచేయకుండా 50కి పైగా గ్రామాల నుండి సుమారు 1000 మందికి పైగా వివిధ వర్గాల ప్రజలు, అలాగే మెట్టుపల్లిలోని అన్ని వార్డుల నుండి స్వచ్చందంగా కుటుంబాలతో తరలి రావటం విశేషం.