మూడొందల ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న భారీ మర్రి చెట్టు కొమ్మలను కొందరు నరికివేశారు. ఈ ఉదంతం కనిగిరి పట్టణ పరిధిలో తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే… ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని దొరువు వద్ద మూడు శతాబ్దాల చరిత్ర కల్గిన భారీ మర్రిచెట్టు ఉంది. శతాబ్దాల కాలంగా ఆ ప్రాంతంలో వేళ్లూనుకుని ఎగబాకుతూ, కొమ్మలతో విస్తరించి ఎంతో మందికి నీడనిస్తుంది. కృష్ణదేవరాయల నాటి ఆనవాళ్లకు గుర్తుగా ఈ భారీ మర్రిచెట్టు ఉందని స్థానికులు చెప్పుతుంటారు.
ఎన్నో విపత్తులకు సైతం ఈ భారీ చెట్టు ఊడలతో నిలదొక్కుకుని సవాల్ విసిరింది. రాజుల కాలం నాటి వైభవాన్ని చెప్పుకొస్తే అప్పట్లో సైన్యాలు గుర్రాలు, ఏనుగులకు కూడా ఈ భారీ వృక్షం సేదతీర్చిందని చెప్తుంటారు. అలనాటి వైభవాలను చెరపేసే చర్యలకు అక్రమార్కులు పాల్పడుతున్నారు. కొండ ప్రాంత స్థలాలకు కూడా రిజిస్ర్టేషన్లు జరిగినట్లు చెబుతున్నారు భారీచెట్టు ఉన్న స్థలం ప్రభుత్వానిది, కొండ ప్రాంతానిది కాదంటూ కొంతమంది బుకాయిస్తున్నారు. ఆ భారీచెట్టు ఆనుకుని ఉన్న స్థలం రెండేళ్ల క్రితం కొనుగోలు చేశానంటూ ఓ వ్యక్తి ఆ స్థలంలోకి విస్తరించిన భారీ మర్రి చెట్టుకు ఉన్న పెద్ద మాను కొమ్మలను నరికివేశాడు. దీంతో సమాచాం అందుకున్న సీఐ ఖాజావలి, ఎస్‌త్యాగరాజు ఆచెట్టును పరిశీలించారు. కొమ్మలను నరుకుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అందుకు పురామాయించిన వ్యక్తిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.