నేటి భారత రాజకీయాల్లో దాదాభాయి నౌరోజీని మితవాదిగా పేర్కొనవచ్చేమో కానీ ఆయన సత్యవాది. ఈరోజు వలస వాదం గురించి తెలియని వాళ్లు ఉండరు... ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా ప్రసిద్ది చెందిన దాదాభాయ్ నౌరోజీ బొంబాయిలో 4 సెప్టెంబర్ 1825న ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. వారు తన తొంభయ్ రెండేళ్ళ సుదీర్ఘ జీవితంలో ఎన్నో ఘనతలను సాధించి ఆయా రంగాల్లో ప్రథముడిగా నిలిచారు. తను చదువుకున్న ఒకానొక భారతీయ కళాశాలలో గణితశాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే అధ్యాపకుడిగా నియమితుడైన తొలి భారతీయుడు నౌరోజీ. సహచర ఆచార్యుల నుంచి ‘‘భారతదేశ భవితవ్యం’’గా ప్రశంసలను అందుకున్న నౌరోజీ ఇరవయ్యేడో యేటనే రాజకీయరంగ ప్రవేశం చేశారు; మరో రెండేళ్ళలోనే రస్త్ గొఫ్తార్ అంటే సత్యవాది అనే ఆంగ్లో–గుజరాతీ పత్రికను ప్రారంభించారు. 1867లో అతను లండన్‌లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్‌ను స్థాపించారు, ఇది బ్రిటీష్ ప్రజల ముందు భారతీయ దృక్కోణాన్ని ఉంచే లక్ష్యంతో ఏర్పాటైంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క పూర్వీకుల సంస్థల్లో ఒకటి. ఈ సంఘం చాలా మంది ప్రముఖ ఆంగ్లేయుల నుండి మద్దతు పొందింది, అంతేకాదు బ్రిటిష్ పార్లమెంట్‌పై కొంత ప్రభావాన్ని చూపగలిగింది.
జూలై 1875లో నౌరోజీ బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1876లో ఆ పదవికి రాజీనామా చేసి లండన్ వెళ్లిపోయారు. 1883లో ఆయన జస్టిస్ ఆఫ్ ది పీస్‌గా నియమితుడయ్యారు, 'వాయిస్ ఆఫ్ ఇండియా' అనే వార్తాపత్రికను ప్రారంభించారు. ఆగష్టు 1885లో గవర్నర్ లార్డ్ రే ఆహ్వానం మేరకు బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో చేరారు. 31 జనవరి 1885న, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఏర్పడినప్పుడు, అతను దాని ఉపాధ్యక్షులలో ఒకరిగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం చివరలో, అతను భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించారు. 1886, 1893, 1906లో మూడుసార్లు దాని అధ్యక్షుడయ్యారు. 1902లో అతను సెంట్రల్ ఫిన్స్‌బరీకి ప్రాతినిధ్యం వహిస్తూ హౌస్ ఆఫ్ కామన్స్‌లో లిబరల్ పార్టీ సభ్యునిగా ఎన్నికయ్యారు. బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెల్చిన తొలి భారతీయుడు నౌరోజీ... భారతదేశం నుంచి సంపద ఇంగ్లాండుకు తరలి వెళుతుందని భావించి ఆధారాలతో సహా పేర్కొని తన ప్రఖ్యాత పావర్టీ ఇన్ ఇండియా అనే పుస్తకంలో దీని గురించి రాశారు. అందులో దీనికి గల ఆరు కారణాలను కూడా పేర్కొన్నారు. జాతీయ ఆదాయ అంచనాలను వేశారు.
కార్ల్ కౌట్‌స్కీ, గియోర్గియ్ ప్లెఖనోఫ్ తదితరుల నాయకత్వంలోని సెకండ్ ఇంటర్నేషనల్‌లో పాల్గొని... ఆ వేదిక మీదనుంచే తొలిసారి ఆయన బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం భారతదేశాన్ని ఎలా కొల్లగొడుతోందో గణాంక వివరాలతో సహా నౌరోజీ వెల్లడించారు. అప్పట్లో భారత జనాభా పాతిక కోట్ల మంది వుండేవారట. వాళ్ళ తలసరి వార్షిక ఆదాయం 27 రూపాయలని’’ ప్రభుత్వం ప్రకటించగా, నిజానికి ఆ మొత్తం 20 రూపాయలకు మించదని నౌరోజీ వాదించి రుజువు చేశారు! ‘‘సుసంపన్నమయిన భారతదేశానికి పట్టాల్సిన గతి ఇదా?’’ అన్నది నౌరోజీ సూటి ప్రశ్న. ఆయన ప్రసంగ సారాంశమే తర్వాత కాలంలో ఓ సిద్ధాంతంగా సుప్రసిద్ధమయింది! అదే డ్రెయిన్ ఆఫ్ వెల్త్, దీన్ని పాఠ్యాంశంగా కూడా బోధించారు.