నెట్‌ఫ్లిక్స్ కుట్ర విఫలం... IC814 ఉగ్రవాదుల అసలు పేర్లు వెల్లడి

VSK Telangana    04-Sep-2024
Total Views |
 
flic
 
నెట్ ఫ్లిక్స్ దెబ్బకు దిగొచ్చింది. తాజా వెబ్ సిరీస్ ‘IC 814: ది కాందహార్ హైజాక్ స్టోరీ’ లో హైజాకర్లలో ఇద్దరికి హిందూ పేర్లు వుండటంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. దీంతో నెట్ ఫ్లిక్స్ తన వెబ్ సిరీస్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల అసలు పేర్లను చేరుస్తూ పొందుపరిచింది. అసలు పేర్లతోనే సిరీస్ ను అప్ డేట్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ఆఫ్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ ఓ ప్రకటన విడుదల చేశారు. 1999 ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ గురించి తెలియని వారి కోసం హైజాకర్ల నిజమైన పేర్లు, కోడ్ పేర్లను కూడా చేరుస్తామన్నారు.
మరోవైపు ఈ వివాదం పెరిగిపోయిన నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ప్రతినిధి మోనికా షెర్గిల్ ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పిలిపించుకుంది. అసలు ఈ సిరీస్ ను చిత్రీకరించడానికి వెనుక వున్న ఉద్దేశాలు, హేతువును వివరించాలని ఆదేశించింది. అలాగే హైజాకర్ల పేర్లను ఎందుకు స్పష్టంగా అందులో పేర్కొనలేదని ప్రశ్నించింది.అలాగే అందులో హైజాకర్లను దృఢంగా, సున్నిత మనస్కులుగా, మధ్యవర్తులు, రాయబారులనేమో అత్యంత బలహీనంగా, దిక్కుతోచని వ్యక్తులుగా ఎందుకు చూపించారో చెప్పాలని కూడా ప్రభుత్వం ప్రశ్నించినట్లు సమాచారం.
నిర్మాత అనుభవ్ సిన్హా తాజా వెబ్ సిరీస్ ‘IC 814: ది కాందహార్ హైజాక్ స్టోరీ’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన సంఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించారు. అయితే, ఈ వెబ్‌సిరీస్ వివాదాస్పదంగా మారింది. హైజాకర్లలో ఇద్దరికి హిందూ పేర్లు ఉండటంపై ఓ వర్గానికి చెందిన నెటిజన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ”బాయ్‌కాట్ బాలీవుడ్” పేరుతో ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
నేపాల్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కి తీసుకెళ్లిన ఘటన ఆధారంగా రూపొందించిన వెబ్‌సిరీస్‌లో హైజాకర్ల పేర్లను చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా, శంకర్ అని పిలవడం చూడొచ్చు. చిత్ర నిర్మాత ఉద్దేశపూర్వకంగా హైజాకర్ల అసలు పేర్లను కాకుండా హిందువుల పేర్లను ఎంచుకున్నారని సోషల్ మీడియాలో చాలా మంది భోలా, శంకర్ పేర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అనుభవ్ సిన్హా వాస్తవాలను తప్పుగా సూచించారని, మతపరమైన మనోభావాలను దెబ్బతిస్తున్నారని విమర్శించారు.