అయోధ్యలోని భవ్య రామ మందిర తొలి వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు రాముడికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాముడి దర్శనం చేసుకున్నారు. అయితే.. గత సంవత్సరం 22 జనవరి 2024 న ఆలయ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి జనవరి పదో తేదీ వరకు 3 కోట్ల 50 లక్షల మందికి పైగా భక్తులు రాముడి దర్శనం చేసుకున్నారు.
అలాగే రామ్ లల్లాకి చెక్కుల రూపంలో, భక్తులు సమర్పించిన నగదు 53 కోట్ల రూపాయలు వచ్చాయి. అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీ ఆదాయం 24.50 కోట్ల రూపాయలు. అలాగే తీర్థ క్షేత్ర ట్రస్ట్ కి సంబంధించిన వివిధ ఖాతాల్లో ఆన్ లైన్ రూపంలో 71 కోట్ల రూపాయలు వచ్చాయి. ట్రస్ట్ బ్యాంకు ఖాతాలో జమ చేసిన 2600 కోట్లకు వడ్డీగా రాముడికి 204 కోట్లు వచ్చాయి.
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ఆలయానికి ఏడాది కాలంలో రూ.363 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయన్నారు.ఆలయ ఆదాయంలో రూ.204 కోట్లు బ్యాంకు వడ్డీల ద్వారా, రూ.58 కోట్లు చందాల ద్వారా వచ్చాయి. ఇప్పటి వరకు 20 కిలోల బంగారం, 13 క్వింటాళ్ల వెండిని భక్తులు సమర్పించారని పేర్కొన్నారు. ఇక కౌంటర్లలోనే 53 కోట్ల విరాళాలు వచ్చాయి.