అయోధ్యలోని భవ్య రామ మందిరం తొలి వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తర్వాత బాల రాముడి ఆలయం నిర్మించుకున్నామని పేర్కొన్నారు. ఈ ఆలయం మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వమని అభివర్ణించారు. ఈ దివ్యమైన గొప్ప ఆలయం భారత్ సంకల్పాన్ని సాధించడంలో గొప్ప ప్రేరణగా మారుతుందని తాను విశ్వసిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.
గత యేడాది అయోధ్యలో రామ్ లల్లా పట్టాభిషేకం అనంతరం ప్రధాని మోదీ చేసిన ప్రసంగ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇందులో 22 జనవరి 2024 అనేది కేలండర్ పై రాసిన తేదీ మాత్రమే కాదని, ఇది కొత్త కాలచక్రానికి మూలమని పేర్కొన్నారు.
రామ మందిరం తొలి వార్షికోత్సవం సందర్భంగా అయోధ్యలో నిర్వహించే వేడుకల కోసం అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేడుక శనివారం ప్రారంభం అవుతంది. మొదట బాల రాముడికి పంచామృతం, సరయూ నది నుంచి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకం చేసి, తదుపరి కార్యక్రమాలను ప్రారంభించారు. వేడుకలు 13 వ తేదీ వరకూ కొనసాగుతాయి. వీటిని సీఎం యోగి ప్రారంభిస్తారు.