నా ఒక్క ఓటు పడకపోతే ఏమవుతుంది?

VSK Telangana    26-Jan-2025
Total Views |

Election Commission of India
 
(ఎన్నికల సంఘం ఏర్పాటై 75 ఏళ్లు... జనవరి 25 జాతీయ ఓటరు దినోత్సవం)
 
తప్పులు చేసే ప్రభుత్వాలను గద్దె దించి, ప్రజలకు మేలు చేస్తారని విశ్వసించే నేతలను ఎన్నుకునే అవకాశమిచ్చేవి ఎన్నికలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన మన భారతదేశంలో ఎన్నికలు అనగానే ఒక భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. అటవీ ప్రాంతాలు, కొండా కోనల్లోని గ్రామాల నుంచి మైళ్ల దూరం నడచి వచ్చి ఓట్లు వేసే ఓటర్లున్నారు. పెళ్లి మంటపం నుంచి కొత్త జంటలు వచ్చి ఓట్లేస్తుంటారు. వీల్ చైర్‌లో వచ్చి మరీ ఓట్లు వేసే దివ్యాంగులనూ చూస్తుంటాం. ఊతకర్రతో కష్టమైనా సరే వచ్చి ఓట్లు వేసే తాతయ్యలు, బామ్మలు కూడా కనిపిస్తుంటారు. అయితే ఇదంతా పల్లెలు, గ్రామాలు, చిన్న పట్టణాలలోను ఎక్కువగా కనిపించే దృశ్యం. అయితే, ఎంతో చదువుకున్నవారు, విజ్ఞులుగా పేరున్న నగర వాసులు మాత్రం ఓటు వెయ్యడానికి ఎంతో బద్ధకిస్తూ పోలింగ్ రోజును సెలవురోజుగా ఆనందిస్తారే తప్ప ఓటెయ్యడానికి ముందుకురారు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన ఎన్నికల విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్న భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటై జనవరి 25, 2025 నాటికి 75 సంవత్సరాలు నిండిన నేపథ్యంలోను... ఈ తేదీని ప్రతి ఏటా జాతీయ ఓటరు దినోత్సవంగాను పాటిస్తున్న సందర్భంగా తాజా పరిస్థితిని ఒకసారి సమీక్షించుకుందాం...
 
దేశీయ ఓటర్లలో, మరీ ముఖ్యంగా పెద్ద పట్టణాలు, నగరాలలోని ఓటర్లలో ఉద్దేశ్యపూర్వకమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. స్థానికంగా ఓటు ఉన్నప్పటికీ పోలింగ్ రోజున ఓటు వెయ్యనివారి సంఖ్య లక్షలు, కోట్లల్లో ఉన్నారు. వీరందరిని చైతన్య పరిచేందుకు ఎన్నికల సంఘంతో పాటు Let's Vote వంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఫలితం ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా సంపన్నులు, ఎగువ మధ్య తరగతి ప్రజలు పోలింగ్‌కు దూరంగా ఉన్నట్టు సర్వేలు, ఫలితాల ద్వారా తెలుస్తోంది. సంపన్నులు తమ దైనందిన జీవితానికి సంబంధించిన అవసరాల విషయంలో రాజకీయ నేతలపై ఆధారపడే పరిస్థితులు లేకపోవడం వల్ల కూడా వీరు పోలింగ్‌ని నిర్లక్ష్యం చెయ్యడం జరుగుతోందనే వాదన ఉంది. అయితే, ఎన్నికైన ప్రభుత్వ విధానాలకు ప్రజలందరూ ఎంతో కొంత ప్రభావితమవుతారు కనుక, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వీరు సైతం ఓటేస్తేనే మంచి ఫలితాలుంటాయి. మరోవైపు ఎందరో వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఈసీ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుండగా నగర యువతరం పోలింగ్‌కు దూరంగా ఉంటోంది. ఇక మొదటిసారి ఓటుహక్కు వచ్చిన యువతీ యువకులు ఆ తొలి ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకుంటున్నప్పటికీ తరువాత క్రమంగా చప్పబడుతున్నారు. మొత్తంగా స్తీ, పురుష ఓటర్ల విషయానికి వస్తే స్త్రీలే కాస్తో కూస్తో ఓటు వెయ్యడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు.
 
ఇందుకు ప్రధాన కారణం.. ఓటు వేయడాన్ని హక్కుగా మాత్రమే భావించి, "నా ఒక్క ఓటు పడకపోతే ఏమవుతుంద"ని భావించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే... అదే సమయంలో, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ఉత్తమ నేతలను ఎన్నుకుని, సమాజ నిర్మాణం లక్ష్యంగా ఓటు వెయ్యడాన్ని తమ బాధ్యతగా పౌరులు గుర్తిస్తే ప్రజాస్వామ్య లక్ష్యం నెరవేరుతుంది. కేవలం ఒక్క ఓటుతో ఓడిన నేతలు, కుప్పకూలిన ప్రభుత్వాల గురించి మనకు చరిత్ర చెబుతోంది. అందువల్ల ఓటును బాధ్యతగా గుర్తించి వేసి తీరాలి. ఓటు వెయ్యనివారికి సెలవు దినాన్ని రద్దు చెయ్యాలని, ఓటు వేసినట్లు వేలిపై ఇంకు మార్కును కార్యాలయంలో చూపిస్తేనే ఆ రోజు జీతం ఇవ్వడం లేదా పోలింగ్ రోజును వారు వ్యక్తిగతంగా పెట్టుకున్న సెలవుగా పరిగణించడం లేదా జరిమానాలు విధించాలనే ప్రతిపాదనలు కూడ ఉన్నాయి.
 
ప్రజల మనస్తత్వం ఇలా ఉంటే.. అధికారులు, వ్యవస్థల పనితీరును కూడా ఈ సందర్భంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఓటరు జాబితాల రూపకల్పనలో నిర్లక్ష్యం, జాప్యం, కచ్చితత్వం నకిలీ ఓటర్ల ఏరివేత వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అధికారంలో ఉన్న పలు రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఓటరు జాబితాలను ప్రభావితం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
 
రాజకీయ పార్టీల విషయానికి వస్తే ప్రలోభాలు, ఉచితాలను ప్రకటిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేలా మేనిఫెస్టోలను విడుదల చెయ్యడం జరుగుతోంది. చాలా రాజకీయ పార్టీలు ఉచితాలు, ప్రలోభాలు లేనిదే ఓట్లు వేయించుకోలేం అనే నిర్ణయానికి వచ్చిన పరిస్థితులున్నాయి. తాత్కాలిక తాయిలాలు లేదా మితిమీరి ఇచ్చే హామీలను ఓటర్లు గమనించి విజ్ఞతతో ఓటు వేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. అదే సమయంలో ఎన్నికల్లో ఓటమి పాలైన పలు పార్టీలు, నేతలు ఈవీఎం (EVM)లను నిందించడం, మళ్లీ పాతకాలపు బ్యాలెట్ బాక్స్ విధానం రావాలని డిమాండ్ చెయ్యడం కనిపిస్తోంది. అయితే, బ్యాలెట్ బాక్స్‌ల కాలపు రిగ్గింగ్ రోజులు ఈనాటికీ మర్చిపోలేం... అదే సమయంలో ఈవీఎంలలోని లోపాలను ఏ ఒక్కరూ నిరూపించలేకపోవడం కూడా గమనార్హం. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మొబైల్స్, టాబ్స్, కంప్యూటర్స్ ద్వారా ఓటు వేసే అవకాశం (రిమోట్ ఓటింగ్) గురించి కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ ఈవీఎంల విషయంలోనే ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రిమోట్ ఓటింగ్ గురించి మాట్లాడే పరిస్థితులు ఇప్పటికిప్పుడు లేవు.
 
ఎన్నారై ఓటర్ల విషయానికి వస్తే... భారత ఎన్నికల కమిషన్ ప్రవాస భారతీయులకు ఎంతో శ్రద్ద తీసుకొని ఓటు వేసే అవకాశం కల్పిస్తే, వారు 2024 ఎన్నికలలో ఓటు వేయడం పట్ల చెప్పుకోదగిన ఆసక్తి చూపలేదని వెల్లడవుతుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ గణాంకాల గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఓటరు జాబితాలో ఎన్‌ఆర్ఐ ఓటర్లు వారి పేర్లను చేర్చుకునే సమయంలో చాలా ఉత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ క్రమంలో ఓటరు జాబితాలో 1.2 లక్షల మంది తమ పేర్లను చేరుకున్నారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం భారత్ కు ఓటు వేసేందుకు వచ్చింది కేవలం 2.48 శాతం మంది మాత్రమే. డేటా ప్రకారం 2024లో 1,19,374 మంది ఎన్‌ఆర్ఐలు వారి పేర్లను నమోదు చేసుకున్నారని ఎన్నికల సంఘం గణాంకాలను విడుదల చేసింది. ఇందులో కేరళ నుంచి అత్యధికంగా 89,839 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ లోక్‌సభ ఎన్నికల సమయంలో కేవలం 2,958 మంది మాత్రమే భారతదేశానికి వచ్చారు. అందులో 2,670 మంది కేరళ నుంచి మాత్రమే ఉన్నారు.
 
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 885 మంది విదేశీ ఓటర్లలో లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఇద్దరు మాత్రమే ఓటు వేశారని నివేదిక తెలిపింది. దీంతో విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి గణాంకాలు మహారాష్ట్రలో కూడా కనిపించాయి. అక్కడ 5,097 మంది ఎన్నారై ఓటర్లలో 17 మంది మాత్రమే ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 7,927 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు నమోదయ్యారు. కానీ 195 మంది మాత్రమే ఓటు వేశారు. ఇక విదేశాల్లో నివసిస్తున్న కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి అనేక పెద్ద రాష్ట్రాల నుంచి ఒక్క ఎన్నారై కూడా ఓటు వేసేందుకు భారత్‌కు రాలేదని ఎన్నికల సంఘం తెలిపింది. అసోం 19 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయలేదు. బీహార్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. నమోదు చేసుకున్న 89 మంది ఎన్నారై ఓటర్లలో ఎవరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. 84 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయని పరిస్థితి గోవాలో కనిపించింది.
 
ఇందుకుగల కారణాలను గమనిస్తే భారతదేశంలోని ఎన్నారై ఓటర్లు ఈ దేశానికి వచ్చి మాత్రమే తమ ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నారై ఓటర్ల భారతీయ చిరునామా ఆధారంగా ఓటరు జాబితాలో పేరు నమోదైంది. అయితే ఓటు వేయడానికి వారు వ్యక్తిగతంగా తమ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. చాలామంది ఎన్నారై ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేకపోవడానికి ఇదే కారణం. ఎన్నారై ఓటింగ్ తగ్గడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇందులో సమయాభావం, భారీ ఛార్జీలను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో ప్రజలు ఓటు వేసేందుకు రావడం మానేశారని పలువురు చెబుతున్నారు. ఈ పరిస్థితిని సరళతరం చేసేలా వ్యవస్థను మార్చాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
మొత్తంగా ఓటర్లు తమ వంతుగా బాధ్యతను గుర్తిస్తేనే జాతీయ ఓటరు దినోత్సవ లక్ష్యం నెరవేరుతుంది.