ఆరెస్సెస్‌‌లో పాల్గొనే ప్రభుత్వోద్యోగుల విషయంలో కోర్టులు చెప్పిందిదే..

    20-Oct-2025
Total Views |

Uttarakhand Rss
 
 
ప్రాథమిక హక్కుల పరిరక్షణ:
 
RSS కార్యకలాపాల్లో పాల్గొనడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(c) కింద పౌరులకు లభించిన సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ (Freedom of Association) పరిధిలోకి వస్తుంది.
 
తొలగింపునకు ప్రాతిపదిక కాదు:
 
గతంలో లేదా ప్రస్తుతం RSSతో అనుబంధం కలిగి ఉండడం అనేది ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయడానికి, తొలగించడానికి లేదా పదోన్నతి నిరాకరించడానికి సరియైన కారణం కాదని న్యాయస్థానాలు నిర్ధారించాయి. ఈ తీర్పులు ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక బాధ్యతలను నిష్పాక్షికంగా నిర్వర్తిస్తూనే, తమ సామాజిక, సాంస్కృతిక అనుబంధాలను చట్టబద్ధంగా కొనసాగించవచ్చని స్పష్టం చేస్తున్నాయి.
 
కేసు 01: పి. రాఘవులు VS స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1965వ సంవత్సరం.
 
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాఘవులు అనే ఉద్యోగిని RSS సభ్యత్వానికి సంబంధించి తొలగించడానికి ప్రయత్నించినప్పుడు ఈ కేసు దాఖలైంది. ఆ సందర్భంలో హైకోర్టు స్వేచ్ఛ (Freedom of Association) అనే ప్రాథమిక హక్కును ప్రస్తావించింది. RSS రాజకీయ సంస్థ కాదని, అది సామాజిక-సాంస్కృతిక సంస్థ అని పేర్కొంది. ఒక ఉద్యోగిని ప్రాథమిక హక్కును వినియోగించుకున్నందుకు శిక్షించడం చెల్లదని తీర్పు ఇచ్చింది. RSS రాజకీయ సంస్థ అనే అపోహను ఈ తీర్పు ఖండించింది. ఒక సంస్థ నిషేధించబడనంత కాలం, దానిలో సభ్యత్వం కలిగి ఉండడం లేదా దాని కార్యకలాపాల్లో పాల్గొనడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా హైకోర్టు గుర్తించింది.
 
కేసు 02: స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ VS రామశంకర్ రఘువంశీ, ఇతరులు, 1983వ సంవత్సరం
 
ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు గతంలో RSS, జనసంఘ్ కార్యకలాపాలలో పాల్గొన్నాడనే కారణంతో అతనిని ఉద్యోగం నుండి తొలగించారు. ఈ తొలగింపు అక్రమం అని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. "ఒక వ్యక్తి గతంలో RSS లేదా జనసంఘ్‌కు చెందినవాడని చెప్పడం మాత్రమే అతని సేవలను రద్దు చేయడానికి సరైన కారణం కాదు" అని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా, RSS రాజకీయ పార్టీ కాదనే విషయాన్ని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. గతంలో RSS కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రభుత్వ సేవా నియమాలను ఉల్లంఘించినట్లు కాదని, ఉద్యోగి తొలగింపునకు అది సరియైన ప్రాతిపదిక కాదని తేల్చి చెప్పింది.
 
కేసు 03: రామ్ పాల్ VS స్టేట్ ఆఫ్ పంజాబ్, 1967వ సంవత్సరం
 
రాష్ట్ర ఉద్యోగి అయిన రామ్ పాల్ 1965లో RSS శిబిరానికి హాజరయ్యాడనే ఆరోపణపై సర్వీస్ నుండి తొలగించారు. ఆ సమయానికి, ఉద్యోగులు రాజకీయ సంస్థలలో పాల్గొనరాదనే నియమం అమల్లో ఉంది. హైకోర్టు తీర్పు ఆ ఉద్యోగి తొలగింపు నిర్ణయాన్ని రద్దు చేసింది. RSS ఒక రాజకీయ సంస్థ అని చెప్పడానికి ఎటువంటి ఆధారమూ లేదని స్పష్టం చేసింది. ఉద్యోగిని తొలగించడం ద్వారా అధికారులు అతని ప్రాథమిక హక్కులను (సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ - ఆర్టికల్ 19(1)(c)) ఉల్లంఘించారని పేర్కొంది.
 
RSS అనేది సాంస్కృతిక/సామాజిక సంస్థగా పరిగణించబడాలని, దాని కార్యక్రమాలలో పాల్గొనడం ప్రభుత్వ ఉద్యోగ నియమాలకు విరుద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.