మొంథా తుపాను ఎఫెక్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాలపై కూడా చూపించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా మంది ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఈ నేపథ్యంలో వరంగల్ నగరంలో కూడా తుపాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వెంటనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు రంగలోకి దిగి, సహాయక కార్యక్రమాలు చేపట్టారు. సిటీలోని కాశిబుగ్గ, ఎస్.ఆర్. నగర్ ప్రాంతాలు నీటమునిగాయి. దీంట్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే వరంగల్ ఎమ్మార్వో సాయంతో బాధితులను దగ్గరలోని శుభం గార్డెన్ కి స్వయంసేవకులు తరలించారు.
అలాగే వర్షపు నీళ్లు రహదారుల పైకి కూడా వచ్చి చేరాయి. మరీ ముఖ్యంగా వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై చింతగట్టు వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్వయంసేవకులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో పోలీసు విభాగానికి పూర్తిగా సహకరించారు.
మరో వైపు నీట మునిగిన ప్రాంతాల్లో వున్న ప్రజలు ఆహారం కోసం ఇబ్బందులు పడ్డారు. దీంతో స్వయంసేవకులు సుమారు 250 కి పైగా ఆహారపు ప్యాకెట్లను తయారుచేసి, వరద బాధితులకు పంపిణీ చేశారు. అలాగే ప్రజల ప్రాథమిక అవసరాలను గుర్తించడం, ఔషదాలను కూడా పంపిణీ చేసి, వారందరికీ భరోసా కల్పించారు.
మొన్నటికి మొన్న కామారెడ్డిలో కూడా...
ఆగస్టు మాసంలో వర్షాకాలంలో కామారెడ్డి పట్టణంలో కుంభవృష్టి కురిసింది. జిల్లా చరిత్రలోనే కామారెడ్డిలో కుంభవృష్టి కురిసింది. జన జీవనం అస్తవ్యస్తమైంది.జిల్లా చరిత్రలోనే రికార్డు స్థాయిలో వర్షం పడింది. దాదాపు కామారెడ్డి పట్టణం మొత్తం నీటిలో మునిగిపోయింది. ఎటు చూసినా అస్తవ్యస్తమే. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు, సేవా భారతి కార్యకర్తలు అచంచల విశ్వాసం, మొక్కవోని ధైర్యం, సమాజం మనది అన్న విశాల దృక్పథంతో ప్రజలను కాపాడటానికి, వారికి కనీస అవసరాలను తీర్చడానికి రంగంలోకి దిగారు. సేవా కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పూర్తిగా సహకరించారు.
స్వయం సేవకులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వరదల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినారు. మరియుఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు సహకరించి వరదల్లో చిక్కుకున్న 1071 మందిని కాపాడినారు.
మొదటి రోజు కామారెడ్డి పట్టణ కేంద్రం నుంచి మొదలుకుని భిక్కనూరు వరకు 44వ జాతీయ రహదారిపై వరదలు ఉధృతంగా ప్రవహించడంతో బుధవారం రోజంతా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లి, బస్వాపూర్ వద్ద జాతీయ రహదారిపై వరదలో చిక్కుకున్న పలువురు వాహనదారులకు మొదటి రోజు 700 మందికి పులిహోర, అరటి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు సురక్షిత త్రాగు నీరు అందించినారు.