కోదండ రామయ్య కొలువై ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలంలో జైశ్రీరాం అనే పేరుతో ఇటుకలను తయారు చేయనున్నారు. అయోధ్య రామయ్య గుడి కట్టడానికి నాడు కరసేవకులు ఇలాంటి ఇటుకలపైనే జైశ్రీరాం అని రాసి పంపించారు. వాటినే నేడు భవ్య రామమందిర నిర్మాణంలో వాడారు. అలానే చాలామందికి సొంత ఇళ్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. కొందరు మొదట ఇటుకపై రామ అని రాసి పేర్చి ఇల్లు కట్టుకుంటారు. అలా సొంతిల్లు కట్టుకునే వారు శంఖుస్థాపన సమయంలో ఇలా జై శ్రీరాం పేరుతో ఉండే ఈ ఇటుకలను వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ భక్తులకు ఇటుకలను అందించే ఏర్పాట్లు చేస్తోంది.
ఇక రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల్లో ఆసక్తి కలిగిన వారితో, ఇటుకలను కొనుగోలు చేసే భక్తులుతో స్వచ్ఛందంగా ఈ ఇటుకలను తయారు చేయించేలా కార్యాచరణ రూపొందించి, అమలు చేసే విషయమై కలెక్టర్ దేవస్థానం ఈవో దామోదర్రావుతో చర్చించారు. అయితే ఇలా జైశ్రీరామ్ పేరుతోతయారు చేసిన ఇటుకలను త్వరలో రామాలయంలో ఉంచి రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులకు విక్రయించనున్నారు. రామానుగ్రహంగా విక్రయించే ఇటుకల్లో 100రూపాయలకు రెండు ఇటుకల చొప్పున భక్తులకు అమ్మే అవకాశం ఉందని తెలుస్తోంది.