ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా 128 వ మన్ కీ బాత్ లో కరీంనగర్ ప్రస్తావన తీసుకొచ్చారు. కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్స్‌పై ప్రశంసలు కురిపించారు.జపాన్ ప్రధానమంత్రికి వెండితో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చానని.. పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి కానుకగా ఇంచానన్నారు. ప్రపంచం మన కళాకారుల ప్రతిభను గుర్తించాలని తాను కోరుకుంటున్నానన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనే స్ఫూర్తిని స్వీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు. పండుగల సమయంలో ప్రజలు భారతీయ ఉత్పత్తులను ఎంచుకొని.. వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని వేగవంతం చేశారని.. రాబోయే క్రిస్మస్ సీజన్‌లో కూడా వోకల్ ఫర్ లోకల్ అనే స్ఫూర్తిని గుర్తుంచుకోవాలని కోరారు.
అయోధ్యలోని రామాలయంలో జెండా ఎగుర వేయడం సంతోషాన్ని ఇచ్చిందన్న ఆయన.. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంప్ భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. భారత్ వ్యవసాయ రంగంలో కూడా గొప్ప విజయాన్ని సాధించిందని, 35.7 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే అవకాశాన్ని దక్కించుకుందని.. ఈ విషయానికి దేశానికి, ప్రజలకు సంబంధించినవన్నారు. క్రీడాకారులు దేశానికి కీర్తిని తీసుకువచ్చారన్నారు. చంద్రయాన్-2తో సంబంధాలు తెగిపోయినప్పుడు.. దేశం, శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారని.. కానీ, ఆ రోజే శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 విజయగాథను రాయడం ప్రారంభించారన్నారు.
యువత అభిరుచి, శాస్త్రవేత్తల అంకిత భావాన్ని చూసిన ప్రతిసారి తన హృదయం ఉత్సాహంతో నిండిపోతుందన్నారు. ఇదే మన దేశబలమన్నారు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్‌కు ఉందన్న ఆయన.. మన యువత అసమాన శక్తి, బలమైన సంకల్పంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి వంటి వివిధ రంగాల్లో యువత అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. కష్టతరమైన వాటిని సైతం భారత్ సాధిస్తోందని.. మహిళల అంధుల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిందన్నారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితర సంస్కరణలతో భారత యువత వికసిత్ భారత్ కలను సాకారం చేస్తారని బలంగా విశ్వసిస్తున్నానన్నారు.
కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలోని ఓ వీడియో తన దృష్టిని ఆకర్షించిందని.. అందులో అంగారక గ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా రూపొందించిన చోట డ్రోన్లను ఎగురవేయడానికి మన యువత ప్రయత్నించారన్నారు. వాటికి జీపీఎస్ మద్దతు లేకపోవడం వల్ల డ్రోన్లు నేలకూలుతున్నప్పటికీ.. పుణెకు చెందిన విద్యార్థుల బృందం పట్టుదలతో పలుమార్లు యత్నించి డ్రోన్లు కొంత సమయం ఎగిరేలా చేశారన్నారు.
నౌకాదళ దినోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడుతూ డిసెంబర్ 2న కాశీ తమిళ సంగమం ప్రారంభమవుతుందని.. తమిళ భాషను ప్రేమించే వారందరికీ ఇదొక వేదికగా మారిదన్నారు. ఇటీవల ఐఎన్‌ఎస్ మహేను ప్రారంభించారని.. దానికి గొప్ప వారసత్వం కలిగిన మహే పేరు పెట్టారన్నారు. కేరళ, తమిళనాడు ప్రజలు దీన్ని ప్రశంసించారన్నారు. మన నౌకాదళం వేగంగా స్వావలంబన దిశగా కదులుతోందన్నారు. డిసెంబర్ 4న మనం నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని.. ఈ రోజు మన ధైర్యవంతులైన నౌకాదళ సిబ్బందిని గౌరవించే అవకాశమన్నారు.