భారత మహిళ తన శక్తిని చాటింది. క్రికెట్ లో జగజ్జేతగా నిలిచింది. ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. ప్రపంచ వ్యాప్తంగా భారత మహిళా జట్టును ప్రపంచం మెచ్చుకుంటోంది. భారత మహిళా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది టీమ్ ఇండియా. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ విజయం సాధించారు. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్ లో భారత జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే..ఇక భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోగానే, రెండు దశాబ్దాలుగా ఆ కలను మోసిన దిగ్గజ క్రీడాకారిణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భావోద్వేగానికి లోనయ్యారు.
2005, 2017లో భారత్‌ను రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌కు నడిపించిన మిథాలీకి, ఈ విజయం ఆమె జీవితకాలపు స్వప్నం నెరవేరిన మధుర క్షణం. రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్‌కు సేవ చేసిన దిగ్గజ బ్యాటర్ మిథాలీ రాజ్, జట్టు ప్రపంచకప్ గెలిచిన వెంటనే తన భావోద్వేగాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “వరల్డ్ ఛాంపియన్.. భారత మహిళల జట్టు ఆ ప్రపంచకప్ ట్రోఫీని ఎత్తుకోవడం చూడాలని నేను రెండు దశాబ్దాలకు పైగా ఈ కల చూశాను. నేడు ఆ కల ఎట్టకేలకు నిజమైంది” అని మిథాలీ Xలో పోస్ట్ చేశారు. 2005లో గుండె పగిలిన బాధ నుంచి 2017లో పోరాటం వరకు.. ప్రతి కన్నీరు, ప్రతి త్యాగం, ఇక్కడ మనం ఉన్నామని నమ్మి బ్యాట్ పట్టిన ప్రతి యువతి.. ఇవన్నీ ఈ క్షణానికి దారితీశాయి. మీరు కేవలం ఒక ట్రోఫీని గెలవలేదు, భారత మహిళల క్రికెట్ కోసం కొట్టుకున్న ప్రతి హృదయాన్ని మీరు గెలిచారు. జై హింద్” అని మిథాలీ ముగించారు.
మిథాలీ రాజ్ పోరాట పటిమ, మహిళా క్రికెట్‌కు ఆమె చేసిన అసాధారణ కృషిని హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు గుర్తించింది. విజయోత్సవ ర్యాలీ సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు సభ్యులు ప్రపంచకప్ ట్రోఫీని మిథాలీ రాజ్ చేతికి అందించారు. తమ విజయం ఆమె కృషికి దక్కిన ఫలితమేనని ఆటగాళ్లు కీర్తించారు. ఈ చారిత్రక విజయం తర్వాత మిథాలీ మీడియాతో మాట్లాడుతూ.. “భారత్ ఎట్టకేలకు ప్రపంచకప్ గెలవడం పట్ల నేను చాలా సంతోషంగా, భావోద్వేగంగా ఉన్నాను. ఇది సంవత్సరాలుగా మేమంతా ఎదురుచూస్తున్న విషయం చివరకు మేము దానిని చూశాం” అని అన్నారు.