బెంగళూరు: సంఘ కార్యశతాబ్ది ఉత్సవాలను దేశమంతటా ఘనంగా నిర్వహించుకుంటోంది. ఇందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రంలో కూడా తన శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. అయితే కొన్ని చోట్ల మాత్ర ఈ ఉత్సవాలను నిర్వహించకూడదనే ఆంక్షలు వస్తున్నాయి. ఇటీవల చిత్తాపూర్,యాద్గిర్ లాంటి ప్రాంతాలలో అభ్యంతరాలు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం, కోర్టులు జోక్యంచేసుకోవాల్సి వచ్చింది.
తాజాగా యాద్గిర్ జిల్లాలోని కెంభావి పట్టణంలో, నవంబర్ 3న జరగాల్సిన ఆర్‌ఎస్‌ఎస్ పథ్ సంచలన్ సందర్భంగా దళిత సంఘర్ష్ సమితి (డిఎస్‌ఎస్) సభ్యులు ఈ కార్యక్రమం చేయొద్దని ప్రకటించడంతో మొదట్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నిరోధించడానికి, సురపుర తాలూకా పరిధిలో నవంబర్ 3న ఉదయం కెంభావి పోలీస్ స్టేషన్‌లో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సురపుర తహశీల్దార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రెండు గ్రూపుల ప్రతినిధులు సమావేశమయ్యారు. విస్తృత చర్చల తర్వాత, దళిత నాయకులు నిరసనను ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు. దాంతో సంఘ పథ సంచలన్‌కు మార్గం సుగమయింది. ఈ కార్యక్రమం సందర్భంగా శాంతియుతంగా పథ సంచలన్ నిర్వహించాలని, ఎటువంటి రెచ్చగొట్టే నినాదాలు లేదా చర్యలను అనుమతించదని షరతులతో కూడిన అనుమతిని అధికారులు ఇచ్చారు. అలా నవంబర్ 04, మంగళవారం కెంభావిలో RSS పథ సంచలన్‌కు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది.
ఈ పథ సంచలన్ ఉదయం 9:30 గంటలకు కెంభావి మునిసిపాలిటీ నుండి ప్రారంభమై రైల్వే స్టేషన్ రోడ్, మార్కెట్ బీడీ, గ్రామ పంచాయతీ సమీపంలోని కీలక ప్రాంతాల గుండా వెళుతుంది. పట్టణ కేంద్రంలో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొంటారని భావిస్తున్నారు.