వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో నవంబర్ 7న ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం ఆలపించాలని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రాష్ట్రప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని చర్యల తీసుకుంది. అందుకోసం రాష్ట్ర నోడల్ అధికారిగా భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ ఆర్. మల్లికార్జునరావును నియామించింది. విద్యాలయ్యాల్లో, జిల్లాల్లో, మండలస్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.
ఈ కార్యక్రమ ఏర్పాట్ల కోసం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్ని రాష్ట్రాల నోడల్ అధికారులతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల అధికారులతో సమావేశమై నిర్థిష్ట కార్యాచరణ రూపొందించనున్నారు. తదుపరి చర్యలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు విడుదల చేశారు.