అస్సాంలోని శ్రీభూమి జిల్లా బరాక్ వ్యాలీలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన సభ వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నాయకుడు బిధుభూషణ్‌దాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో బంగ్లాదేశ్ జాతీయ గీతమైన ‘అమర్ సోనార్ బంగ్లా’ను ఆలపించడం వివాదానికి కారణమైంది.. కరీంగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. "ఇది చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమను తెలియజేస్తోంది" అని ఘాటుగా విమర్శించింది.
ఇటీవల అస్సాం సహా భారత ఈశాన్య రాష్ర్టాలను తమ దేశంలో భాగంగా చూపుతూ బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో తాజా వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై అసోం మంత్రి కృష్ణేందు పాల్ స్పందిస్తూ, ఇది చాలా వింతైన సంఘటన అని, దీనిపై పోలీసు విచారణ జరిపించాల్సిందిగా కోరతానని తెలిపారు. బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కరీంగంజ్ వంటి జిల్లాలో ఈ ఘటన జరగడం వివాదాన్ని మరింత పెంచింది.