ఆయుష్మాన్ భారత్‌లో భారీ మోసం..300 పైగా నకిలీ ఐడీలు

VSK Telangana    04-Nov-2025
Total Views |
Fake Ayushman Bharat card
 
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నఆయుష్మాన్ భారత్ యజన పథకంలో మోసాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో భారీగా నకిలీ ఆయుష్మాన్ కార్డులను తయారుచేస్తున్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను పోలీసులు , నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) సంయుక్తంగా కనుగొంది. వారు జరిపిన దాడుల్లో భాగంగా 300కు పైగా నకిలీ ఆయుష్మాన్ భారత్ ఐడీలు (కార్డులు), వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలు, కంప్యూటర్లు, నకిలీ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని, వారికి తప్పుడు వివరాలతో నకిలీ ఆయుష్మాన్ కార్డులను తయారు చేసి, ఒక్కో కార్డుకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
 
ఈ కుంభకోణంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, NHA తీవ్రంగా స్పందించాయి. దేశవ్యాప్తంగా నకిలీ కార్డుల తయారీ పంపిణీపై నిఘా పెంచాలని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలను ఆదేశించారు. ఈ నెట్‌వర్క్‌లో పాలుపంచుకున్న కొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మరిన్ని కీలక వివరాలను రాబట్టేందుకు విచారణ కొనసాగుతోంది. ఆయుష్మాన్ భారత్ వ్యవస్థలో నకిలీ ఐడీలను గుర్తించేందుకు సాంకేతిక నిఘాను మరింత కఠినతరం చేయాలని NHA నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించిన కార్డులను కేవలం ప్రభుత్వ అధీకృత కేంద్రాల ద్వారా మాత్రమే పొందాలని, అనధికార వ్యక్తులను నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరించారు.