కానీ చరిత్రను కనుక మనం పరిశీలించి చూస్తే సిక్కులు, హిందువులు ఎప్పటి నుండో కలిసి ఉన్నారనే చెబుతోంది. ఇప్పుడుమాత్రం కొందరు కావాలని ఈ రెండింటి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. కొన్ని దుష్ప్రచారాల ప్రభావానికి గురైన ఇలాంటివారు కనీసం నానక్ జీ పుట్టినరోజునైనా వాస్తవాలను గ్రహించి భారతీయ జీవన స్రవంతిలో ఐక్యమవుతారని ఆశిద్దాం.
సిక్కులకు రాముడికి మధ్యవిడదీయరాని బంధం ఉంది. సిక్కుమత పవిత్ర గ్రంథం అయిన గురుగ్రంథ్ సాహెబ్‌లో హరి తర్వాత ఎక్కువగా మనకు కనబడే, ప్రశంసించబడే దేవుడి పేరు రాముడు..
సిక్కుమత గ్రంథంలో రాముడి ప్రస్తావన
ఘట్ ఘట్ రామయ్యా రామత్ రామ్ రాయ్ గుర్ సబ్దే గుర్ లివ్ లగే (పేజీ 172)
ప్రతి హృదయంలో రాముడు ఉన్నాడు. గురువు వాక్కు ద్వారా, దేవుని పట్ల ప్రేమ నిక్షిప్తమవుతుంది.
నిర్గుణ్ రామ్ గుణ వాసి హోయి (పేజీ 222)
నిర్గుణ రాముడు మానవుని పుణ్యాలకు కారకుడవుతాడు. తన అహంకారాన్ని తొలగించుకునేవాడు భగవంతుడిని తలచుకుంటాడు.
జాట్ కాట్ దేఖావో తత్ తత్ తుమ్ హీ మోహి ఇహు బిసుఆసు హోయి ఆయో.
కై పాహి కరౌ అర్దాస్ బెంతీ జౌ సుంతో హై రఘురాయో (పేజీ 205)
నేను ఎక్కడ చూసినా, నిన్ను అక్కడ కనుగొంటాను. ఇప్పుడు నాకు దాని గురించి దృఢంగా నమ్మకం కలిగింది.
రఘురాయ్ స్వయంగా ప్రతిదీ వింటున్నప్పుడు, నేను ఎవరి ముందు ప్రార్థన చేయాలి?
రామ్ రామహు బాంభాగియో జల్ థాల్ మహియాలీ సోయి.
నానక్ నామి ఆరాధి-ఐ బిఘను నా లగై కోయి (పేజీ 521)
"ఓ అదృష్టవంతులారా, సముద్రం, భూమి, ఆకాశంలో వ్యాపించి ఉన్న రాముడిని ధ్యానించండి." నానక్ ఇలా అంటాడు, "ఆ నామాన్ని ధ్యానించడం ద్వారా, మానవునికి ఎటువంటి విపత్తు సంభవించదు."
ఇలా రాముడి గురించిన ప్రస్తావన ఉంటుంది. రాముడు, రాజారాముడు, రఘునాథ్ వంటి రాముడికి సంబంధించిన దాదాపు 2500 సార్లు మనకు రామ వర్ణన గురుగ్రంథ సాహెబ్‌లో ఉంటుంది.
ఇక సిక్కుల పదవ గురువు అయిన శ్రీ గోవింద్ సింగ్ మహారాజ్ "రామావతారం" అనే పూర్తి రచనను రాముడి రూపంలోని దేవుని పూర్తి అవతార కథకు అంకితం చేశారు. ఇందులో 864 శ్లోకాలు ఉన్నాయి. చివరి రెండు శ్లోకాలలో రామకథను చదవడం ద్వారా కలిగే ఫలాలను కూడా వివరించారు.
ఇంకా, సిక్కు పండితుడు రాజేంద్ర సింగ్ రాసిన 'సిక్కు ఇతిహాస్ మే శ్రీ రామ జన్మభూమి' అనే పుస్తకం గురు గ్రంథ్ సాహిబ్‌లో అనేక మంది సిక్కు గురువులు భగవాన్ రాముడిని పూజించిన వివిధ కథనాలను అందిస్తుంది. తన రచనలో, శ్రీ ఆది గ్రంథ్‌లోని రాముడు వాల్మీకి రామాయణంలోని అదే రాముడు, దశరథుని కుమారుడు అని ఆయన వివరించారు. ఈ పుస్తకం పాఠకుడిని గురు నానక్ దేవ్ జీ జీవితంతో ప్రారంభమై గురు గోవింద్ సింగ్ జీ రామ జన్మభూమి మందిర్ విముక్తితో ముగిసిన మధ్యయుగ భారతీయ చరిత్ర గుండా తీసుకెళుతుంది. మొదటి, తొమ్మిదవ మరియు పదవ గురువుల జీవితాలను వివరంగా చర్చించారు. బాబర్ మరియు ఔరంగజేబు దుష్ప్రవర్తనను కూడా నిశితంగా పరిశీలించారు. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌లో భగవాన్ రాముడి పేరు 2500 కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించబడిందని ఆయన చెప్పారు కూడా..
అయోధ్యలోని సరయు నది ఒడ్డున బ్రహ్మ కుండ్ సమీపంలో మూడు సిక్కు మందిరాలు ఉన్నాయి. ఈ మూడు సిక్కు మందిరాలను బ్రాహ్మణ పూజారులు చూసుకున్నారు, కానీ తరువాత 19వ శతాబ్దం మధ్యలో శ్రీ గులాబ్ సింగ్‌కు అప్పగించారని లిఖిత కథనాలు చెబుతున్నాయి.
సుప్రింకోర్టు తీర్పులో అయోధ్యను గురునానక్ సందర్శించినట్లుగా పేర్కొన్నారు
మనం ఇంకా పరిశీలనగా చూస్తే కనుక గురునానక్ అయోధ్య సందర్శన , నగరంపై ఆయన పరిశీలనలు 'జనమ్ సఖిస్'లో, ముఖ్యంగా భాయ్ మాన్ సింగ్ యొక్క పోతి జనమ్ సఖిలో నమోదు చేయబడ్డాయి. యాదృచ్ఛికంగా, బాబర్ రామాలయాన్ని నాశనం చేయడానికి ముందు గురునానక్ అయోధ్యను సందర్శించడాన్ని, నవంబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన రామ జన్మభూమి తీర్పులో న్యాయమూర్తులలో ఒకరు ఆలయం ఉనికికి రుజువుగా పేర్కొన్నారు.
రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై తన తీర్పులో సుప్రీంకోర్టు సామాన్య శకం 1510-11లో అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని "దర్శనం" కోసం గురునానక్ దేవ్ సందర్శించిన విషయాన్ని ప్రస్తావించింది . 1,045 పేజీల తీర్పులో, సుప్రీంకోర్టు రికార్డులో చేర్చబడిన కొన్ని జన్మ సఖిలను (జనన కథలు) ఆధారంగా తీసుకుంది, వీటిలో గురునానక్ దేవ్ రాముడి జన్మస్థలమైన అయోధ్యను సందర్శించిన వివరణ ఉంది. "రికార్డులో పొందుపరచబడిన జన్మ సఖిల సారాంశాల నుండి, రామ జన్మభూమికి సంబంధించిన ఖచ్చితమైన స్థలాన్ని గుర్తించడానికి ఎటువంటి ఆధారాలు లేవన్నది నిజమే, కానీ రామ జన్మభూమి దర్శనం కోసం గురునానక్ దేవ్ జీ అయోధ్యను సందర్శించడం అనేది సామాన్య శకం 1528కి ముందే యాత్రికులు అయోధ్యను సందర్శిస్తున్నారని, రామ జన్మభూమి దర్శనం చేసుకుంటున్నారని చిత్రీకరించిన సంఘటన. దానితో పాటుగా సామాన్య శకం 1510-11లో రామ జన్మభూమి దర్శనం కోసం గురునానక్ దేవ్ జీ సందర్శన, హిందువుల విశ్వాసం, నమ్మకాలకు మద్దతు ఇస్తుంది" అని సుప్రీం కోర్టు పేర్కొంది.
వాదనలో పేర్కొన్నట్లుగా, రాముడి స్థలం సంప్రదాయం, నమ్మకం , విశ్వాసానికి సంబంధించిన సమస్యను నిర్ణయించేటప్పుడు సుప్రీంకోర్టు గురునానక్ గురించి ప్రస్తావించింది. సిక్కు విశ్వాసం మతపరమైన, సాంస్కృతిక , చారిత్రక పుస్తకాల అధ్యయనంలో ఆసక్తి ఉన్న వ్యక్తి రాజిందర్ సింగ్ ప్రకటనను కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.
శ్రీ రాముని గౌరవనీయమైన జన్మస్థలమైన అయోధ్యను ఎల్లప్పుడూ సనాతన ధర్మానికి మూలస్తంభంగా చూస్తారు. కానీ సిక్కు మతంతో ఆ పవిత్రస్థలంకి సంబంధించిన లోతైన , శాశ్వతమైన సంబంధం గురించి అంతగా తెలియదు. అయోధ్యధామ్ అని పిలువబడే ఈ పవిత్ర నగరం సిక్కు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది, ఒకరు కాదు, ఏకంగా ముగ్గురు సిక్కు గురువులు అయోధ్య నగరాన్ని సందర్శించారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
గురునానక్ దేవ్ జీ అయోధ్య సందర్శన
అయోధ్య , సిక్కు మతం మధ్య పవిత్ర బంధాన్ని మొదట సిక్కు మత స్థాపకులు శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్ స్థాపన చేశారు , ఆయన క్రీ.శ. 1510-11లో తన మొదటి ఉదాసి (ఆధ్యాత్మిక ప్రయాణం) సమయంలో నగరాన్ని సందర్శించారు. గురు నానక్ దేవ్ జీ ఐక్యత, భక్తి ,ధర్మం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి విస్తృతంగా ప్రయాణించారు . ఆ సందర్భంలో ఆయన అయోధ్య సందర్శన నగరంని ఆధ్యాత్మిక ప్రాంతంగా భావించారు. ఈ తీర్థయాత్రలో, గురు నానక్ దేవ్ జీ రాముడి జన్మస్థలం యొక్క పవిత్ర స్థలంలో నివాళులర్పించారు, అయోధ్యను మతపరమైన సరిహద్దులను అధిగమించిన ధార్మిక కేంద్రంగా గుర్తించారు.
18వ శతాబ్దం చివరలో వ్రాసిన భాయ్ మాన్ సింగ్ పోతి జనమ్ సఖీ ప్రకారం, గురునానక్ జీ అయోధ్యలో ఉన్నప్పుడు తన శిష్యుడైన మర్దనతో ఇలా అన్నాడు. "మర్దానియా! ఇహ్ అజుధియా నగరి శ్రీ రామచంద్ర జీకి హై.. చల్, ఇస్కా దర్శన్ కరీ",
అంటే.. 'మర్దానా! ఈ అయోధ్య నగరం శ్రీరామచంద్రాజీకి చెందినది. కాబట్టి మనం ఆయన దర్శనానికి వెళ్దాం” అన్నారు. భాయ్ మాన్ సింగ్ యొక్క పోతి జనమ్ సఖీ 1787లో రాయబడిందని చెబుతారు.
బాబర్ 1528లో రామాలయాన్ని నాశనం చేయడానికి కొంతకాలం ముందు గురునానక్ అయోధ్యను సందర్శించాడని భాయ్ మాన్ సింగ్ రాసిన పోతి జనమ్ సఖి సూచిస్తుంది. రెండు వందల సంవత్సరాల తరువాత రాసిన మాన్ సింగ్ రాసిన జనమ్ సఖి నానక్ జీ అయోధ్య సందర్శనకు సంబంధించిన ప్రస్తుత చారిత్రక వృత్తాంతాల నుండి తీసుకోబడింది. బాబా సుఖ్‌బాసి రామ్ రాసిన మరో రచన కూడా ఇలాంటి కథనాన్ని ఇస్తుంది, ఇది అతని సమకాలీనుడైన మొఘల్ ఆక్రమణదారుడు బాబర్ ఆలయాన్ని నాశనం చేయడానికి ముందు నానక్ జీ అయోధ్యను సందర్శించాడని మళ్ళీ సూచిస్తుంది.
గురునానక్ బాబర్ దురాగతాలను ఖండిస్తూ, అయోధ్యలోని రామాలయ విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ, "ఈ రాజులు కసాయిలు తప్ప మరేమీ కాదు" అని అన్నారు.
అయోధ్య రక్షణలో సిక్కు - హిందూ ఐక్యత
గురునానక్ దేవ్ తో పాటు, గురు తేజ్ బహదూర్ , గురు గోవింద్ సింగ్ వంటి ఇతర సిక్కు గురువులు కూడా వేర్వేరు సమయాల్లో అయోధ్యను సందర్శించారని రికార్డులు చూపిస్తున్నాయి. 1668లో అయోధ్యను సిక్కుల తొమ్మిదవ గురువు శ్రీ గురుతేజ్ బహదూర్ సందర్శించారు.గురునానక్ దేవ్ జీ మాదిరిగానే గురు తేజ్ బహదూర్ జీ కూడా అయోధ్య ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించారు. తర్వాత 1672లో పదవ గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కూడా అయోధ్యను సందర్శించారు. ధైర్యం , ధర్మంలో పాతుకుపోయిన ఖల్సా పంత్‌ను స్థాపించిన గురు గోవింద్ సింగ్ జీ , అయోధ్యను స్థితిస్థాపకత, ఆధ్యాత్మిక బలానికి ఒక దీపస్తంభంగా చూశాడు.
శ్రీ గురు గోవింద్ సింగ్ దేవ్ తన ఆత్మకథ 'బచిత్ర నాటకం'లో, తాను శ్రీరాముడి చిన్న కుమారుడు లవుడి వారసుడినని, గురునానక్ దేవ్ శ్రీరాముడి పెద్ద కుమారుడు కుశుడి వారసుడని రాశారు.
1697లో ఔరంగజేబు మొఘల్ దళాలు అయోధ్యలోని శ్రీరామ ఆలయంపై దాడి చేసినప్పుడు ఈ భాగస్వామ్యం స్పష్టంగా కనిపించింది . దీనికి ప్రతిస్పందనగా, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ అఘోరి సాధువులతో పాటు 400 మంది నిహాంగ్ సిక్కులను ఆలయాన్ని రక్షించడానికి పంపారు . ఈ యోధులు కలిసి రామ జన్మభూమి పవిత్రతను కాపాడటానికి తీవ్రంగా పోరాడారు, అయోధ్య రక్షణలో సిక్కు-హిందూ ఐక్యత వారసత్వాన్ని సుస్థిరం చేశారు.
నేడు, ప్రశాంతమైన సరయు నది వెంబడి ఉన్న చారిత్రాత్మక గురుద్వారా సాహిబ్‌లు, ముఖ్యంగా బ్రహ్మకుండ్‌లో సజీవ స్మారక చిహ్నాలుగా ఇవి నిలుస్తాయి. ఈ గురుద్వారాలు సనాతన ధర్మం, సిక్కు మత సంగమాన్ని ప్రతిబింబిస్తాయి . శతాబ్దాలుగా, సిక్కు గురువులు, హిందూ సాధువులు, ఋషులు, యోధులతో భుజం భుజం కలిపి నిలిచి, ఆక్రమణదారుల నుండి ధర్మాన్ని రక్షించడంలో రెండు సంప్రదాయాల మధ్య సంబంధాలను బలోపేతం చేశారు. ఆ సంబంధాలను ఇప్పుడున్న పరిస్థితులలో, హిందువులపై కొందరు సిక్కుల దాడుల (ఖలిస్తానీ తీవ్రవాదులు నేపథ్యంలో) హిందువులు, సిక్కులు కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరింత సంఘటనా శక్తిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంతోషి దహగాం