దేశాన్ని ఏకం చేసిన వందేమాతరం! సంపూర్ణ గీతం.. భావం మీ కోసం..

VSK Telangana    06-Nov-2025
Total Views |
  
Bharat Mata
 
భారత స్వాతంత్య్ర పోరాటోద్యమంలో వందేమాతర గీతానికి ఒక సుస్పష్టమైన ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో సమరయోధులకు స్ఫూర్తినిచ్చిన ప్రేరణాగీతం వందేమాతరం. బ్రిటిష్ పాలకుల పాలిట సింహస్వప్నం ఈ వీర గీతం.. దేశభక్తి గీతం. వందేమాతరం అన్న ఒక్క పదం వింటే చాలు నాటి బ్రిటిష్ పాలకులకు ముచ్చెమటలు పట్టేవి. ఈ పదాన్ని ఉచ్ఛరించిన భారతీయులకు తీవ్రాతి తీవ్ర శిక్షలు విధించి ప్రవాసం పంపేవారు. అంతగా తెల్లదొరలను వణికించింది ఈ చైతన్య గీతం. భారతీయులలో ఆంతగా చైతన్యాన్ని, ప్రేరణను, స్ఫూర్తిని నింపిన ఈ గీతం భావాన్ని తెలుసుకోవడం మనందరి కర్తవ్యం. స్వాతంత్రోద్యమం ప్రధానంగా శ్రీ బంకించంద్ర చటర్జీ రచించిన ఆనందమఠం నవలలో భాగంగా వందేమాతర గీతం. అయితే ఆనందనఠం రచనకు ముందే ఆయన ఈ గీతాన్ని రచించారు. వందేమాతర గీతానికి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పూర్తి గీతాన్ని, భావాన్ని తెలుసుకుందాం రండి...

వందేమాతరం.. వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలామ్

సస్య శ్యామలాం మాతరం ॥వందేమాతరం.......

శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీమ్

ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్

సుహాసినీం సుమధుర భాషిణీమ్

సుఖదాం వరదాం మాతరం ॥వందేమాతరం.......... 2

కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే

కోటి కోటి భుజైర్ఘృత ఖర కరవాలే

అబలా కేనో మాఁ ఎతో బలే

బహుబల ధారిణీం నమామి తారిణీం

రిపుదల వారిణీం మాతరం ॥వందేమాతరం॥..........3

తుమి విద్యా తుమి ధర్మ

తుమి హృది తుమి మర్మ

త్వంహి ప్రాణాః శరీరే

బాహుతే తుమి మాఁ శక్తి

హృదయే తుమి మాఁ భక్తి

తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే ॥వందేమాతరం....... 4

త్వం హి దుర్గా దశప్రహరణధారిణీ

కమలా కమలదళ విహారిణీ

వాణీ విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం

అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం, మాతరం |॥వందేమాతరం......5

శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం ధరణీం, భరణీం, మాతరం ॥వందేమాతరం.........6 
 
 
భావం
 
పుణ్యప్రదములైన గంగ, యమునాది జీవనదులను కలిగిన దానవు, మధురఫల భరితవు, మలయ పర్వతముల నుండి వీచే గాలుల చేత చందనాన్ని పొంది మా సేదతీర్చే వాత్సల్యపూర్ణవు అయిన తల్లీ! నీకు నమస్కరిస్తున్నాను - 1
 
స్వచ్ఛమైన తెలివెన్నెల చేత పరవశించిన రాత్రులు కలిగినదానవు. వికసించిన పారిజాత సుమాలతో శోభించే నిత్యమంగళ రూపానివి, దరహాస చంద్రికలతో మాపై ప్రేమామృతాన్ని కురిపించే వాత్సల్యపూర్ణవు, లలితపదసంభరిత సంభాషణా చరురవు అయిన తల్లీ! నీకు ప్రణామములు - 2
 
విజయయాత్రా సంరంభోత్సవ సమయంలో అసంఖ్యాక ప్రజల గొంతు కలలో నినదించే జయ జయ ధ్వానానివి (శబ్దానివి) నీవు. కోట్లాది భుజాలపై ధరింపబడిన పదునైన ఖడ్గసముదాయం కల్గినదానవు. అధికాధిక బల సంపన్నురాలవైన, ప్రచండ శక్తి స్వరూపిణివి అయిన నిన్ను అబల అని పేర్కొనటంలో ఔచిత్యం లేదు తల్లీ! శత్రు మూకలను సంహరించగల బలోపేతవైన వీరమాతవు నీవు. ప్రాణికోటి సకల దుఃఖాలను పోగొట్టి తరింపజేయగల దానవు నీవే తల్లీ! - 3
 
నీవు సమస్త జ్ఞానానివి. ధర్మానివి, సకల జీవకోటిలో చేతనా కేంద్రమైన హృదయస్థానానివి. సకల జ్ఞాన సారానివి నీవు. సమస్త జీవుల ప్రాణానివి నీవు. మమ్ములను దివ్యబలసంపన్నులుగా పెంచి పోషించే వీరమాతవు నీవు. అరివీర భయంకరమైన మా భుజాంతర్నిహితమై వున్న శక్తివి నీవేతల్లీ! అమ్మా! మా అందరి హృదయాలలో జనించే భక్తి రూపానివి నీవే. ప్రతి మందిరంలోను నీ దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంటాము - 4
 
దశవిధ ఆయుధధారిణి అయిన దుర్గవు నీవు. సకల సంపత్ ప్రదాయిని అయిన లక్ష్మీదేవివి నీవు. పరాపర విద్యా ప్రదాయిని అయిన సరస్వతీ మూర్తివి నీవు. తల్లీ! నీకు అభివాదములు. అనంతైశ్వర్య ప్రదాతవు, అనన్యసామాన్యురాలివి, పుణ్యజలపూర్ణవు, అన్నపూర్ణవు అయిన మాతృమూర్తీ! నీకు వందనములు. - 5
 
సస్యశ్యామలవు, సరళవర్తనివి, మందస్మిత వదనారవిందవు, సకలాభరణ భూషితవు అయిన మాతృమూర్తీ! విశ్వజననీ! నీకు శతాధిక వందనాలు. శతసహస్ర ప్రణామములు - 6
 
 
 
బంకించంద్రుడు మాతృప్రేమతో వందేమాతర గీతంలో భారతభూమి సర్వసంపన్నత, వైభవాలను, 'సుజల', 'సుఫల', 'సస్యశ్యామల' - అనే పదాలతో పల్లవిలో వర్ణించారు. భారతభూమి ఇంతటి సంపదలతో తులతూగాలంటే అక్కడ నివసించే వారి మనస్తత్వం చందనంలా ఉండాలనే దృఢ సంకల్పం ఆయన మనసులో ఉంది. ఎందుకంటే మలయ పర్వతాలు చందన వృక్షాలకు ప్రసిద్ధి. చందనాన్ని అరగ దీస్తే సుగంధం వెలువడుతుంది. అది గాలిలో కలిసినప్పుడు చల్లదనాన్నిస్తుంది.
 
భారతభూమిలో సంవత్సరంలో 8 నెలలు ఎలాంటి ముసురులేకుండా ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది చల్లని వెన్నెల రాత్రులు ఆహ్లాదాన్నిస్తాయి. సూర్యరశ్మి కావలసినంతగా ఉంటుంది. వర్షపాతం అవసరమైనంత మాత్రమే ఉంటుంది. దాంతో వాతావరణం వింతసోయగాన్ని కల్గి ఉంటుంది. అందువల్ల ఈ భూమి మిగిలిన ప్రపంచదేశాలకన్నా ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ భూమిలో అన్ని పంటలూ పుష్కలంగా పండుతాయి. భారతభూమి కున్న ఈ ప్రత్యేకతలను వర్ణిస్తూ, తల్లికి ఉండే ఎన్నో విశేషణాలు బంకించంద్రుడి
మనస్సులో మెదిలి ఈ చరణంలో వచ్చాయి.
 
పరపాలనతో బలహీన పడటం వలన ఏర్పడిన అప్పటి దేశపరిస్థితలను గమనించి, భారత్కు పట్టిన గ్రహణం విడిచిన తర్వాత దృశ్యం ఎలా... ఉంటుందనే విషయాన్ని మూడవ చరణంలో కవి మనముందు ఆవిష్కరిం
చాడు. భారత ప్రజలు శక్తి సంపన్నులై, ఆయుధ ధారులై, శత్రుమూకలను చీల్చి చెండాడుతుండగల్గడం, వాళ్ళు బలహీనులు కారనే దృశ్యం ఆయన కళ్ళముందు సాక్షాత్కరించింది.
 
తర్వాతి చరణంలో ప్రపంచంలోని అన్ని విద్యలకు మన భారతమాతే జన్మభూమిగా విరాజిల్లుతున్న భావన కవికి మదిలో మెదిలింది. సమాజ జీవనం సరైన పంథాలో ముందుకు సాగటానికి ప్రతివ్యక్తి ఏమిచేయాలి?
ప్రతి వ్యక్తి కర్తవ్యమేమిటి? ధర్మమేమిటి? వ్యక్తులంతా తమ తమ ధర్మాన్ని పాటించాలనే విషయం భారతదేశంలో చెప్పబడింది. తమ తమ కర్తవ్యాన్ని ఈ మాతృభూమి సేవకై వినియోగించాలనేది ఈ ధర్మానికి చెప్పబడిన అర్థం. మాతృభూమి కోసం పనిచేయటమే నాధర్మం. ప్రాణంతో ఉండి కూడా మాతృభూమికోసం పనిచేయకపోతే ప్రాణం లేనట్లేనని ఇక్కడివారి కన్పిస్తుంది. మాతృభూమిపట్ల భక్తి కలిగి ఉండటమే ఇక్కడున్న ప్రతి ఒక్కరి సర్వస్వం. భుజాల్లో శక్తి, హృదయంలో భక్తి ఉండటంతో ఇక్కడి వారికి ప్రతి మందిరంలో మాతృభూమి దివ్యమంగళ విగ్రహం కన్పిస్తుంది.
 
అయిదవ చరణంలో మాతృభూమి స్తోత్రం పఠిస్తున్నప్పుడు కవికి దేవి మూడు రూపాల్లో దర్శనం ఇచ్చింది. 'దశప్రహరణ ధారిణి దుర్గ', 'కమల దళ విహారిణి లక్ష్మి', 'వాణీ విద్యా దాయిని సరస్వతి'గా భారతమాతను దర్శించటంతో కవిలో భావావేశం పొంగిపొర్లి ఈ చరణంలో తర్వాతి విశేషణాలు స్ఫురించాయి. అవి 'అమలాం', 'అతులాం', 'సుజలాం’, “సుఫలాం’, “శ్యామలాం', 'సరలాం’,‘సుస్మితాం', '‘భూషితాం', ‘ధరణీం’, భరణీం' ఈ భావాలన్నీ హృదయాంతరంగాల్లో మారు మ్రోగగా వందేమాతరం, వందేమాతరం అంటూ గీతాన్ని పూర్తి చేశాడు బంకించంద్రుడు.
 
కవి మనస్సులోని 'మాతృభూమే నా సర్వస్వం' అనే భావన కోటికోటి కంఠాలలో నుండి ' ప్రతిధ్వనించాలంటే వారందరిలోనూ అదే భావావేశం రావాలి. అపుడే కోటికోటి భుజాలతో ఖడ్గధారులై స్వాతంత్య్ర సాధనకు, దేశరక్షణకు సైనికులు దశప్రహరణధారులవుతారు. విదేశీయులచే చీరకొంగు లాగబడుతున్న లక్ష్మీదేవి, వారి చెరనుండి తప్పించుకొని కమలంపై పునఃప్రతిష్టితమవుతుందప్పుడు. విదేశీయుల చేతిలో బానిసగా
మారిన సరస్వతీదేవి, వారిచేతులనుండి విముక్తమై ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది. శస్త్రశక్తికి, శాస్త్ర, శక్తికి, ధనశక్తికి మళ్ళీ పూర్వ వైభవం సంప్రాప్తిస్తుంది.
 
దాస్యం నుండి భారతదేశం విముక్తం కావాలనే బంకించంద్రుని హృదయంలోని ఆకాంక్ష ఆయన 'కమలా కాంతేర్ దఫ్తర్' అనే నవలలో కన్పిస్తుంది. అందులో ఆయన ఇలా వ్రాశారు. 'నేను ఒడ్డుకు దూరంగా సాగర జలాలపై తేలియాడుతున్న తెప్పపై కూర్చుని ఉన్నాను. చీకటిగా ఉన్న ఒడ్డుపై ఇంకెవరూ లేరు. ఒంటరిగా ఉన్న నేను భయంతో అమ్మా! అమ్మా! అని అరుస్తున్నాను. ఆ సమయంలో క్షితిజంపై అలలలో ఒక మాతృమూర్తి దర్శనమిచ్చింది. చిరునవ్వుతో, ప్రకాశవంతమైన వెలుగులతో దశభుజ, శస్త్రధారి, భూమి స్వరూప, రత్నాలంకృత, సింహవాహిని, శత్రుసంహారిణి అయిన తల్లిని నేను చూశాను. అంతటి శోభాయమానంగా వెలుగొందుతున్న ఆ తల్లి చాలా దూరంగా ఉంది. మనమందరమూ ఆ సాగరజలాల్లోకి దూకి, ఈదుకుంటూ ఆమె వద్దకు చేరుకుంటాము' ఇటువంటి మాతృభూమి స్వరూపం వందేమాతరం అనే గీత రూపంలో కార్తీక శుద్ధ నవమి నాడు స్ఫురించింది. అదృష్టవశాత్తూ ఆయన సంపాదకత్వంలో వెలువడే 'వంగదర్శన్' పత్రిక మరుసటిరోజు అచ్చవుతున్న సమయంలో సరిగ్గా ఆ గీతం సరిపోయేటంత
ఖాళీ స్థలం మిగిలిపోయింది. ఆ ఖాళీ స్థలంలో ఆగీతాన్ని పొందుపరచారు. అది చూసి బంకించంద్రుడు 'గీత మైతే అచ్చయింది. అయితే దానిలో ఉన్న భావం అర్థం కావటానికి 25 లేదా 30 సంవత్సరాలు పడుతుంది' అన్నారు. జరిగింది కూడా అదే. అతని సన్నిహితులు కొందరు, ఆ గీతంలో సంస్కృత శబ్దాలు ఎక్కువగా ఉన్నాయని ఆక్షేపించినా, 1880 సం॥లో తాను వ్రాసిన 'ఆనందమఠం' నవలలో ఆ గీతాన్ని ఉన్నదున్నట్లుగా పొందుపరచాడు. భవిష్యత్తులో ఆ గీతానికి, ఆ పదాలకు అత్యున్నత మహత్వం కల్గుతుందనే ఆత్మవిశ్వాసం ఆయనకుండేది.
 
ఆనందమఠం నవలలో ఆ గీతాన్ని పాడుతూ భవానందుడు ఇలా అంటాడు. 'మాకు తల్లిలేదు, తండ్రిలేదు, అన్నా, అక్కలెవరూ లేరు. స్నేహితులు లేరు, భార్యా పిల్లలు లేరు. ఇల్లూ వాకిలి కూడా లేదు. కేవలం మాకున్నదొక్కటే. అదే సుజల, సుఫల, సస్యశ్యామల అయిన మాత. మేమందరం ఆమె సంతానం'.
 
బంకించంద్రుడు ఈగీతం గురించి తన అక్కకొడుకుతో చర్చిస్తూ 'ఈ గీతం శాశ్వతంగా నిలుస్తుంది. ఈ దేశవాసులందరి హృదయాలను ఆకర్షిస్తుంది, జయిస్తుంది' అన్నారు. తన కూతురుతో మాట్లాడుతూ 'ఒకనాటికి ఈ గీతాన్ని వంగభూమియే కాక దేశమంతటా ప్రజలు ఒకే కంఠంతో స్ఫూర్తివంతంగా పాడుతూ నృత్యాలను అభినయిస్తారు' అన్నారు. ఆయన చెప్పిన విషయాలు 25లేదా 30 సంllల తర్వాత అని చెప్పటంతో ఆయనను 'ద్రష్ట' అంటున్నాం. కానీ వందేమాతరం మంత్ర సామర్థ్యాన్ని దర్శించటానికి అప్పటిదాకా బంకించంద్ర సజీవులుగా లేరు.