మరోమారు తెరపైకి కశ్మీర్ లోని శారదా సర్వజ్ఞ పీఠ పునరుద్ధరణ అంశం.. చరిత్ర ఇదీ

VSK Telangana    01-Dec-2025
Total Views |

 
pok

పాక్ ఆక్రమిత కాశ్మీరు ( పీఓకే - POK)లోని శారదా సర్వజ్ఞ పీఠాన్ని పునఃప్రారంభించాలని శ్రీ దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి సూచించారు. గురుగ్రామ్‌లోని బనిధామ్ గౌశాల ఆలయాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ సర్వజ్ఞ పీఠానికి మార్గాన్ని తెరిచేందుకు తమవంతు ప్రయత్నాలు కొనసాగుతూనే వుంటాయని స్పష్టం చేశారు. బనిధామ్ ఆలయానికి ఎదురుగా ఉన్న కొండపై ప్రతిపాదిత శారదా ఆలయ స్థలంలో శంకరాచార్యులు "పుష్ప అర్చన" చేశారు.

విధుశేఖర భారతీ స్వామి వారు 20 రోజులుగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో విజయయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి కశ్మీరీ పండితులు వారిని దర్శనం చేసుకున్నారు.అఖిల భారత కాశ్మీరీ సమాజ్ (AIKS) అధ్యక్షుడు రవీందర్ పండిత తన స్వాగత ప్రసంగంలో, కర్తార్‌పూర్ కారిడార్ తరహాలో గౌరవనీయమైన శారదా పీఠానికి మతపరమైన కారిడార్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చరిత్ర...

ఆజాద్ కాశ్మీర్‌లో నీలం నది ఒడ్డున శారదా గ్రామంలో శారదా దేవి శక్తిపీఠ ఆలయం ఉంది. కాశ్మీర్ వేద వేదాంత శాస్త్ర విద్యలకు ప్రముఖ స్థానం. అందుకే కాశ్మీర్‌కు ‘‘శారదా దేశం’’ అని పేరు. అక్కడ కొలువైయున్న సరస్వతీ మాతయే శారదాంబ. ఆమెను ‘‘కాశ్మీర పూర్వ వాసిని’’ అంటారు. కాశ్మీర ప్రజలు నిత్యం ఈ శక్తి పీఠాన్ని సందర్శించి ‘‘నమస్తే శారదాదేవీ కాశ్మీర పురవాసినీ - త్వం హం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే’’అని భక్తితో స్తోత్రం చేస్తారు.

14 వ శతాబ్దానికి ఈ ఆలయం చాలాసార్లు శిధిలమైంది. 19వ శతాబ్దంలో కాశ్మీర్ రాజు మహారాజా గులాబీ సింగ్ ఈ ఆలయాన్ని చివరిసారిగా మరమ్మత్తులు చేశాడు. 1948లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఈ ప్రాంతంలో జరిగి ఈ ప్రాంతం ఫస్తూన్ తెగల ఆక్రమణకు గురై వాళ్ళ అధీనంలో ఉండి పోయింది. తర్వాత ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వశంలో ఉన్నది. దీనికి తోడు 2005లో ఈ ప్రాంతం చోటుచేసుకున్న అతిపెద్ద భూకంపంలో దేవాలయం చాలా శిధిలమైపోయింది అప్పటి నుంచి ఇది మరమ్మత్తులకు నోచుకోలేదు .పాకిస్తానీ హిందువులు అరుదుగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. దీనికంటే వాళ్ళు సింధు బలూచిస్తాన్ పంజాబ్ ప్రాంతాలను సందర్శించటానికి ఇష్టపడతారు. అందుకే ‘కటాస్ రాజ్’దేవాలయానికిచ్చిన ప్రాధాన్యాన్ని పాక్ ప్రభుత్వం దీనిపై చూపటం లేదు

సతీదేవి శరీర భాగాలు 51 ఎక్కడ పడ్డాయో అక్కడ శక్తి పీఠాలు కాలభైరవ దేవాలయాలు వెలసిన సంగతి మనకు తెలుసు ఇక్కడ అమ్మవారి కుడి చేయిపడి శారదా శక్తి పీఠమైంది. 18 మహా శక్తిపీఠాలలో ఇదిఒకటి. ఇక్కడ విద్యా దేవతగా శక్తిని ఆరాధిస్తారు అందుకే శారదా పీఠం అయింది. ఈ దేవాలయం బారాముల్లాకు 60 మైళ్ళు, ముజఫర్ బాద్‌కు 40 మైళ్ళ దూరం లో నీలం లోయలో శారదా అనే కుగ్రామం లో ఉంది .ఇది ‘లైన్ ఆఫ్ కంట్రోల్’కు వాయవ్య భాగంలో 16 మైళ్ళ దూరంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం సంస్కృత విద్యకు, కాశ్మీరీ పండితులకు గొప్ప ఆవాసభూమి. హిందూ బౌద్ధాలు చక్కగా విలసిల్లిన భూమి. 1277-78 కాలపు జైనుల చారిత్రక గ్రంథం ‘ప్రభావక చరిత్ర’ ప్రకారం ఇక్కడ భద్రపరచబడిన వ్యాకరణ గ్రంధాలను చదివి శ్వేతాంబర జైనుడైన హేమచంద్రా చార్య తన ‘సిద్ధాంత హేమ’ వ్యాకరణ గ్రంథం రాశాడు. భగవద్రామానుజాచార్యులు శ్రీరంగం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న బ్రహ్మ సూత్రాలపై బోధాయనుడు రాసిన వృత్తిని పరిశీలించి ‘‘బ్రహ్మ సూత్ర భాష్యం’’అనేశ్రీ భాష్యం’ రాశారు. శారదా దేవాలయం ప్రక్కన సంస్కృత విశ్వ విద్యాలయం ఉండేది. క్రీ.శ 632లో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ దీన్ని సందర్శించి రెండేళ్లు అధ్యయనంలో గడిపి దీనికున్న చారిత్రిక సాంస్కృతిక వైభవాన్ని ప్రస్తుతించారు

కాశ్మీర్ శారదా పీఠాన్ని సర్వజ్ఞ పీఠం అంటారు. ఎన్నో అర్హతలున్నవారు మాత్రమే దీనిని అధిరోహిచగలరు. భగవాన్ శంకర భగవత్పాదులు ఇక్కడికి వచ్చి అన్ని మతాల వాదాలనూ జయించి సర్వజ్ఞ పీఠం అధిరోహించారు. ఇది అతిప్రాచీన ఆలయము, పీఠము. సముద్ర మట్టానికి 11000 అడుగుల ఎత్తున ఉన్నది. భారత ప్రభుత్వాధీనంలోని కాశ్మీర్‌కు ఇది వేసవి విడిది. శారదాలయం 142 అడుగుల పొడవు, 95 అడుగుల వెడల్పు, వెలుపలి గోడలు 6 అడుగుల వెడల్పు 11 అడుగుల పొడవుగా ఉంటాయి. 8 అడుగుల ఎత్తులో ఆర్చీలుంటాయి. శృంగేరిలో శ్రీ శంకరాచార్య స్వామి ప్రతిష్టించిన గంధపు చెక్కతో చేయబడిన శారదాదేవి విగ్రాహాన్ని ఇక్కడి నుండే తీసుకు వెళ్లారని అంటారు.

1148వ సంవత్సరానికి చెందిన కల్హణ మహాకవి శారదా దేవాలయం గురించి వర్ణించాడు. 8 వ శతాబ్దంలో కాశ్మీర్ రాజు లలితాదిత్యునికాలంలో బెంగాల్ ప్రభువు గౌడరాజు అనుయాయులు శారదాదేవిని దర్శించారని, శంకరాచార్యులవారి ‘ప్రపంచసారం’లో శారదాదేవి స్తుతి ఉందని, అది ఇక్కడే రాసి ఉంటారని అంటారు. 1030లో ఈ దేవాలయాన్ని సందర్శించిన ‘అల్ బరూని’అనే చరిత్రకారుడు శారదా దేవి విగ్రహం గంధపు చెక్క-చందన చెక్కతో చేయబడి ఉందని చెప్పి ఈ ఆలయాన్ని ముల్తాన్ సూర్య దేవాలయం, దానేశ్వర్‌లోని విష్ణు చక్రస్వామి దేవాలయం, గుజరాత్‌లోని సోమనాథ దేవాలయంతోను పోల్చి చెప్పాడు. 16 వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి ఆస్థాన నవరత్నాలలో ఒకరైన అబుల్ ఫజల్ కవి ఈ దేవాలయాన్ని వర్ణిస్తూ ఇది మధుమతి నది అంటే నేటి నీలం నది ఒడ్డున ఉందని, ఆలయం బంగారంతో ధగధగా మెరుస్తూ ఉంటుందని ప్రతి శుక్లపక్షం అష్టమినాడు ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని రాశాడు.