సావర్కర్ ను మననం చేసుకోవడం అంటే దేశభక్తిని జాగృతం చేయడమే : మోహన్ భాగవత్

VSK Telangana    13-Dec-2025
Total Views |
 
mohan ji
 
స్వతంత్ర దామోదర వీర సావర్కర్ రచించిన గీతం ‘‘సాగరా ప్రాణ తడమడలా’’115 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శ్రీ విజయపురం, అండమాన్ నికోబార్ దీవులలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వినాయక దామోదర వీర సావర్కర్ విగ్రహాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. అలాగే ‘‘వీర్ సావర్కర్ ప్రేరణా పార్క్’’ను కూడా ప్రారంభించారు.
 
 
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ వీర సావర్కర్ అసాధారణ ప్రతిభ, స్పష్టత, అంకిత భావం, ప్రేమ, ధైర్యం, దేశం పట్ల అంకిత భావంతో నిండిన మహోన్నత వ్యక్తి అని అభివర్ణించారు. సావర్కర్ వ్యక్తిత్వం అనేది ప్రతి కోణంలోనూ సంపూర్ణమైనదని, సంగీతం, కవిత్వం, నాటకం, రచనలు, ప్రజా ప్రసంగాలపై ఆయనకున్న పాండిత్యంతో ఆయన సంపూర్ణ వ్యక్తిగా ఆవిష్కృతులయ్యారని వివరించారు. వీటన్నింటినీ ఆయన భారత దేశానికే అంకితం చేశారని తెలిపారు.

mohan ji2 
వినాయక్ దామోదర్ సావర్కర్ సాహిత్య రచనలు, కవితలు, వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలు, జాతీయ ఐక్యత విషయంలో ఆయనకు అచంచల నిబద్ధత గురించి లోతైన అంతర దృష్టిని అందిస్తాయన్నారు. భాషా వికాసం, సాంస్కృతిక ఆలోచనలకు సావర్కర్ చేసిన కృషి తనను సంపూర్ణ వ్యక్తిగా మార్చిందని, ఆయన ఆలోచనలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
 
సావర్కర్ ను స్మరించుకోవడం అంటే కేవలం చరిత్రను తిరిగి స్మరించుకోవడమే కాదు, నిజమైన దేశ భక్తిని మేల్కొల్పడానికి కూడా ఓ మార్గమని అన్నారు. సావర్కర్ కలల భారతదేశాన్ని నిర్మించాలనుకుంటే, ఆయన అంకితభావం మరియు క్రమశిక్షణను మన జీవితాల్లోకి అన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సావర్కర్ ఆశయాలను నెరవేర్చడానికి యావత్ దేశం సమిష్టి కృషి చేయాలని కూడా పిలుపునిచ్చారు. దేశం కోసం పనిచేయడమే నేటి అవసరమని, ఈ రకంగా ముందుకు సాగాలన్నారు.
 
సావర్కర్ వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి అనేక విశేషణాలు అవసరమని, ఎందుకంటే ఆయన జీవితం అంకితభావం, ప్రేమ, త్యాగం, అజేయమైన ధైర్యం లాంటి వ్యక్తిత్వాల సమ్మేళనం అని మోహన్ భాగవత్ అభివర్ణించారు. తన వ్యక్తిగత బాధలను మరిచిపోయి, దేశం, సమాజం అనుభవిస్తున్న బాధలతో అనుసంధానించబడ్డ వ్యక్తి సావర్కర్ అని, దీనినే దేశభక్తి అంటారని వివరించారు.

mohan ji23