కరసేవకుల జ్ఞాపకార్థం అయోధ్యలో ‘‘స్మారకం ’’ : ట్రస్ట్ కీలక ప్రకటన

VSK Telangana    14-Dec-2025
Total Views |
 
kar sevak
 
అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం అన్న సుదీర్ఘ పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన కరసేవకులు, భక్తుల స్మారకార్థం ఓ చిహ్నాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. అలాగే మందిర నిర్మాణం రాముడు వున్న స్థలంలో ఓ ఆలయ నిర్మాణం కూడా జరగనుంది. ఈ నెల 13 న శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు మహంత నృత్య గోపాల దాస్ అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం జరిగింది.
 
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్,సభ్యులు మహంత దినేద్ర దాస్, కృష్ణ మోహన్, అనిల్ మిశ్రా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో ఆలయ రెండో వార్షికోత్సవం, ప్రతిష్ఠ ద్వాదశి కార్యక్రమాలతో పాటు పలు అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
 
ప్రతిష్ఠ ద్వాదశి కార్యక్రమాలు అంగద్ తిలలో నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ట్రస్ట్ తెలిపింది. ఈ కార్యక్రమాలలో శ్రీరామ కథ పారాయణం మరియు సంగీత మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.డిసెంబర్ 27 నుండి డిసెంబర్ 31 వరకు, శ్రీరామ జన్మభూమి ఆలయంలో మండల పూజ, శ్రీ రామచరితమానస్ సంగీత అఖండ పారాయణ జరుగుతుందని తెలిపారు.

kar sevak2 
ప్రఖ్యాత గాయకులు శ్రీ అనుప్ జలోటా, శ్రీ సురేష్ వాడ్కర్ మరియు శ్రీమతి త్రిప్తి శాక్య తో ‘‘భజన్ సంధ్య’’ వుంటుందని చంపత్ రాయ్ తెలిపారు. అలాగే కథక్ నృత్య ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వుంటాయన్నారు. అలాగే శ్రీరాముడి విషయంలో కవి సమ్మేళనం కూడా నిర్వహిస్తామని తెలిపారు.
రామమందిర నిర్మాణంలో పాల్గొన్న దాదాపు 400 మంది కార్మికులను మార్చి 19న జరిగే హిందూ నూతన సంవత్సర వేడుకలో సత్కరిస్తామని ట్రస్ట్ పేర్కొంది.
 
‘‘ప్రాణ్ ప్రతిష్ఠ ముందు ప్రభు శ్రీ రాంలాలా, ఆయన సోదరులతో కలిసి కూర్చున్న ప్రదేశంలో, ఒక మందిరాన్ని నిర్మించాలని ట్రస్ట్ నిర్ణయించింది.ఈ ఆలయానికి ఆనుకొని, శ్రీరామ మందిర ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని కూడా నిర్మిస్తున్నాం’’అని పేర్కొన్నారు.
 
1990లో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని డిమాండ్ చేస్తూ, జరిగిన నిరసనల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదేశాల మేరకు పోలీసు చర్యతో అనేక మంది కర సేవకులు ప్రాణ త్యాగాలు చేశారు.,