సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాల తీవ్రత తగ్గినా.. ఆపరేషన్ సిందూర్ మాత్రం కొనసాగుతూనే వుంటుందని సీడీఎస్ అనిల్ చౌహాన్ ప్రకటించారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని, భారత త్రివిధ దళాలు ఎప్పుడూ అప్రమత్తంగానే వున్నాయన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి దుండిగల్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవిష్యత్ సంఘర్షణలు గానీ, యుద్ధాలు గానీ అంతా AI పైనే వుంటాయని, మానవ రహిత వ్యవస్థలపైనే ఆధారపడి నడుస్తాయని ప్రకటించారు.
మాటలతో యుద్ధాలు గెలువలేమని, యుద్ధాలు గెలువడానికి మాటలు పనికిరావని,స్పష్టమైన చర్యలతో మాత్రమే విజయం సాధ్యమని పేర్కొంటారు. క్రమశిక్షణ, ప్రణాళిక, వేగంగా కచ్చితమైన నిర్ణయాలను అమలుచేయడం ద్వారా అసలైన దృఢత్వం లభిస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ తామే విజయం సాధించామంటూ ఆ దేశం ప్రకటనలు చేసుకుంటోందని విమర్శించారు. బలహీన వ్యవస్థల కారణంగా ప్రపంచంలోని పలు ప్రాంతాలు అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయని, దానివల్ల తరచూ అభద్రత, ఘర్షణాత్మక పరిస్థితులు కనిపిస్తుంటాయని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను భారత బలగాలు అందిపుచ్చుకుంటున్నాయని అన్నారు. కొత్తగా విధుల్లోకి చేరనున్న యువ అధికారులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అలాగే దేశ సేవకు తమ పిల్లలను అందించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.
శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల కవాతు ఆకట్టుకుంది. మొత్తం 244 మందిలో 29 మంది మహిళా అధికారులు వున్నారు. ఫ్లైయింగ్ ఆఫీసర్ అగర్వాల్ కి ప్రెసిడెంట్ ప్లాక్ తో పాటు నవనగర్ స్వార్డ్ ఆఫ్ హానర్ ను ప్రదానం చేశారు.
ఇక ఈ కార్యక్రమం సందర్భంగా ఆకాశ్ గంగా స్కై డైవింగ్ టీమ్ త్రివరణ, ఐఏఎఫ్ పతకాలతో ప్రదర్శనలు ఇచ్చింది. ఎయిర్ వారియర్స్ రైఫిల్ డ్రిల్, చేతక్ హెలికాప్టర్లు, పిలాటస్ పీసీ 7, విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.