సిక్కుల దగ్గర చరిత్ర అనే బలం వుంది : ఇంద్రేష్ కుమార్

VSK Telangana    15-Dec-2025
Total Views |
 
indresh ji
 
శ్రీ గురుతేగ్ బహదూర్ సాహిబ్ జీ 350 వ బలిదాన్ దివస్ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంతం, ఆల్ గురుద్వారాస్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జలవిహార్ లో కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు ఇంద్రేశ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారక్ అనేది ఓ సంస్కృత శబ్దం అని, సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేవారని వివరించారు. ఆ ప్రచారకులకు బ్యాంక్ అకౌంట్ వుండదని, అతి తక్కువ వస్త్రాలే వుంటాయని, ఇతరుల ఇళ్లల్లో భోజనం చేసి, దేశ సేవ చేస్తారన్నారు. అయితే డబ్బులు కూడగట్టుకోవడం వీరికి నిషేధం అని, ఇలా దేశ వ్యాప్తంగా 4 వేల మంది ప్రచారకులు వున్నారన్నారు.

తన చిన్నతనం నుంచీ సిక్కు మత గురువుల పరంపరను అధ్యయనం చేస్తూ వస్తున్నానని, తన తల్లి కూడా గురుద్వారాకి తీసుకెళ్లేదని గుర్తు చేసుకున్నారు. ఖాల్సా అనేది పదో గురువు ద్వారా వచ్చిందని, ఇది అత్యంత పవిత్రమైందన్నారు. దీనిని మహత్తును కాపాడుతూ రావాలన్నారు. ఇంత పెద్ద సమాజానికి ఖాల్సాను ఇవ్వడం అంత సులభం కాదని, ఇది గొప్ప విషయం అని అన్నారు.
 
 indresh ji23
 
తాము చదువుకుంటున్న సమయంలో ఒక సామెత చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ప్రయాణంలో ఓ సిక్కు కనిపిస్తే భయం లేకుండా వుండొచ్చని, ఎలాంటి అపాయమూ దరిచేరదని, రెండోది లంగర్ దొరికితే ఆనందంగా వుండాలని, కడుపు కూడా నిండుతుందని చెప్పేవారన్నారు. దీనిని మనం పూర్తిగా అనుభవించామన్నారు. సిక్కులు ఈ ఆస్తిని సంపాదించుకున్నారన్నారు. నిర్భయంగా వుండాలన్నది తాను గురువుల నుంచి నేర్చుకున్నానని ఇంద్రేష్ కుమార్ అన్నారు.
 
జ్ఞానం, ధనం, పదవీ అనేది కావాల్సిందేనని, అయితే.. మన మన గుణం కూడా అంతే ముఖ్యమన్నారు. గుణమే అన్నింటికంటే బలమైందని, దీంతో సమాజమే మన ముందు తలవంచుతుందన్నారు. సిక్కుల దగ్గర చరిత్ర అనే బలముందని, అలాంటి వారికి సమాజం అత్యంత గౌరవం ఇస్తుందన్నారు. సిక్కులకు గుణం అనే పెద్ద సంపద వుందని, దీనిని తెలుసుకోవడం చాలా సులభమని, కానీ దీనిని జీర్ణం చేసుకోవాలన్నారు. రాముడు, రావణుడు ఇద్దరూ నాలుగు వేదాలు చదివారని, జ్ఞానంలో కూడా గొప్పవారేనని అన్నారు. ఒకరి నగరం పూర్తిగా స్వర్ణమయం అయితే, మరొకరి దగ్గర అంత ధనం వుండేది కాదని, కానీ.. రాముడి చరిత్ర అత్యంత గొప్పదని, రావణుడి చరిత్ర సరిగ్గా లేదన్నారు. అందుకే ఓడిపోయాడని వివరించారు.
అలాగే ఔరంగజేబు, దారా శిఖోబి ఇద్దరూ అన్నదమ్ములని, దారా శిఖోబి హిందూ చరిత్రను, ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, అదే ఔరంగజేబు అందుకు వ్యతిరేకంగా తండ్రిని జైలులో వేసేశాడని గుర్తు చేశారు.
 indresh ji2

భారత్‌లో అనేక మంది వీరులు, పుణ్య పురుషులు జన్మించారని, అయినా విదేశీయుల ఆక్రమణలో వుండిపోయామని సిక్కు మత గురువు జగ్ బీర్ సింగ్ అన్నారు. హిందువుల్లో ఐక్యత లేని కారణంగా అలా జరిగిందన్నారు. ప్రస్తుతం హిందువుల్లో ఐక్యత పెరిగిందని అనుకుంటున్నారని, కానీ.. ఒకప్పుడు ఒక వీధిలో ఒకే వినాయకుడు వుండేవాడని, ఇప్పుడు మాత్రం ప్రతి కులానికీ ఓ వినాయకుడు అయిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో ఐక్యత లేని కారణంగానే ఇలా జరుగుతోందని, విదేశీయులు లక్షలకి లక్షలు భారత్ కి రాలేదని, అతి తక్కువ సంఖ్యలోనే వచ్చి, మనల్ని పాలించారన్నారు.
 
గురునానక్ మూడు సూత్రాలపై సిక్కు మతం ప్రారంభమైందని, అందులో మోదటిదిది నామ స్మరణం, కష్టార్జిత సంపాదన మూడోది సంపాదించిన దాంట్లోంచి పేద వారికి ఇవ్వడం అన్న మూడు సూత్రాలపై సిక్కు మతం స్థాపితమైందన్నారు. గురు తేగ్ బహదూర్ సాహిబ్ దేశం కోసం పోరాడారని అన్నారు. ధర్మం నశించి, అధర్మం నశించినప్పుడు నేను జన్మిస్తానని దేవుడు మాటిచ్చారని, అదే కోవలోని వారు తేగ్ బహదూర్ అని అభివర్ణించారు.

Sikh history 

గురుతేగ్ బహదూర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముస్లిం దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు అనేక రాక్షస హింసలు పెట్టారని, ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని చూశాడని, మత మార్పిళ్లు కూడా చేశారన్నారు. దీనిని చూడలేక కొందరు కశ్మీరీ పండితులు, ప్రజలు గురుతేగ్ బహదూర్ ని శరణుచొచ్చారని, అప్పుడు ఓ మహానుభావుడి బలిదానం అవసరముందని చెప్పారని తెలిపారు. అప్పుడు ఔరంగజేబ్ కి ఓ సందేశం పంపమని చెప్పారని, గురు తేగ్ బహదూర్‌ని మత మార్పిడి చేస్తే, అనేక మంది హిందువులను చేసినట్లేనని వర్తమానం పంపారు. అప్పుడు తేగ్ బహదూర్ ని మతీదాస్, సతీదాస్, దయాళా, జయతాజీ, ఉదయ్ జీ అనే ఐదుగుర్ని బంధించి, ఢిల్లీ తీసుకెళ్లి, గురు సన్నిధిలో మరణ శిక్ష విధించారని గుర్తు చేశారు.


Sikh history1
ఈ కార్యక్రమంలో​ శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీతో పాటు, ధర్మరక్షణ కోసం బలిదానం చేసిన భాయి మతి దాస్ జీ, భాయి సతి దాస్ జీ, భాయి దయాలా జీల అత్యున్నత త్యాగాలను నేటి తరానికి గుర్తు చేస్తూ నివాళులు అర్పించారు. అలాగే ​సిక్కుల చరిత్ర మరియు బలిదానాలపై ఒక ప్రేరణదాయక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ కార్యక్రమం కీర్తనలు, అర్దాస్‌తో మొదలైంది. చివరికి గురుకా లంగర్ (ప్రసాద వితరణ)తో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలోతెలంగాణ గురుద్వారాల కమిటీ అధ్యక్షులు సర్దార్ శ్రీ గురుచరణ్ సింగ్ బగ్గాతో పాటు పలువురు సిక్కు ప్రముఖులు పాల్గొన్నారు.