
వచ్చే ఏడాది నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో వివిధ దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 92 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లుగా కేంద్రం ప్రకటించింది.
ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టుల ఆర్థిక మూలాలను కేంద్రం దెబ్బతీసింది. జాతీయ దర్యాప్తు సంస్థ NIA రూ. 40 కోట్లు, ఢిల్లీ పోలీసు అధికారులు రూ. 40 కోట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ. 12 కోట్ల విలువైన నక్సల్స్ ఆస్తులను జప్తు చేశాయి. ఇక 2014లో 126 జిల్లాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా.. 2025 నాటికి కేవలం 11 జిల్లాలే మిగిలాయి. ఈ ఏడాది సుమారు 317 మంది నక్సలైట్లు హతమయ్యారు. అలాగే 862 మంది అరెస్టు కాగా.. మరో 1,973 మంది తుపాకులను వదిలి లొంగిపోయారు. అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం అభివృద్ధి పనులు కూడా చేపట్టింది. 20వేల 815 కోట్ల రూపాయల విలువ చేసే 17,589 కిలో మీటర్ల రోడ్లు వేయించింది. వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్టాఫీసులు, మొబైల్ టవర్ల నిర్మాణం చేపట్టారు. వచ్చే ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన ప్రాంతంగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు.