
అయోధ్య రామాలయ ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి, మాజీ పార్లమెంటు సభ్యుడు ,సాధువు అయిన డాక్టర్ రామ్ విలాస్ దాస్ వేదాంతి సోమవారం (డిసెంబర్ 15, 2025) ఉదయం కన్నుమూశారు. ఆయనకు 75 సంవత్సరాలు. ఆజన్మాంతం రాముడికోసం రామమందిర నిర్మాణం కోసం ఒక సాధువు వలె జీవనం గడిపిన వీరు మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈనెల పదవతేదీన రామాయణ ప్రవచనాల కోసం వారు రేవా కు చేరుకున్నారు. అయితే అక్కడ . ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. ఢిల్లీ నుండి ఎయిర్ అంబులెన్స్‌కు ఫోన్ చేశారు, కానీ దట్టమైన పొగమంచు కారణంగా అది సమయానికి దిగలేకపోయింది. వెనువెంటనే ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన మరణించారు. వారి కుమారులు మహంత్ రాఘవేష్ దాస్ వేదాంతి ఈ సమాచారాన్ని అందించారు. ఆయన మృతదేహాన్ని ప్రస్తుతం రేవా ఆశ్రమంలో ఉంచారు, త్వరలో అయోధ్యకు తీసుకురానున్నారు.
డాక్టర్ వేదాంతి రామ జన్మభూమి ఉద్యమం తొలినాళ్ల నుండే దానిలో పాలుపంచుకున్నారు. ఆయన రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు, రామ మందిర ఉద్యమానికి సంబంధించిన కీలకవ్యక్తిగా భావిస్తారు.. అయోధ్యలోని హనుమాన్‌గఢికి చెందిన మహంత్ అభిరామ్ దాస్ శిష్యుడు వీరు. ప్రఖ్యాత సంస్కృత పండితులుగా పేరుగడించిన వీరుచాలా సంవత్సరాలుగా సరళమైన భాషలో ప్రజలకు అర్థం అయ్యేలా అయోధ్య రాముడి గుడి ముందు, ,హనుమాన్‌గఢి వద్ద రామాయణం చెప్పారు. అంతేకాక వారు బీజీపీ పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు. అయోధ్యలోని వశిష్ఠ భవన్ వారి నివాసం. డాక్టర్ రామ్ విలాస్ దాస్ వేదాంతికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ నివాళులర్పించారు. "డాక్టర్ వేదాంతి శ్రీరామ జన్మభూమి ఉద్యమానికి కీలక స్తంభం, అంకితభావం కలిగిన సాధువు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి మరియు ఆయన శిష్యులు ఈ నష్టాన్ని భరించే శక్తిని పొందాలి" అని ఆయన రాశారు.