
ఎట్టకేలకు నాలుగు దశాబ్దాల వారి నిరీక్షణ ఫలించింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు 36 మందికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. జీవితంలో మర్చిపోలేని విషాదానికి గురైన వీరంతా నాలుగు దశాబ్ధాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని సీఎం రేఖా గుప్తా అన్నారు. ఇది కేవలం ఉద్యోగ కల్పనే కాదు, వారి ఆత్మగౌరవాన్ని, హక్కులను, గుర్తింపును పునరుద్ధరించడమేనని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బాధిత కుటుంబాలకు పారదర్శక, సత్వర ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారని చెప్పారు.
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1984లో తన అంగరక్షకుల కాల్పుల్లో చనిపోవడం తెల్సిందే. అనంతరం ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కుటుంబసభ్యులను కోల్పోయిన 19 మందికి ప్రభుత్వ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. తాజాగా నియామక పత్రాలిచ్చిన వారితో కలిపితే ఇప్పటి వరకు 55 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లయింది.
నాడు జరిగిన అల్లర్లలో ఒక్క ఢిల్లీ పరిసరాలలోనే 2,800 మంది సిక్కులు మరణించినట్లు ప్రభుత్వ లెక్కల అంచనా.. కాగా, దేశం మొత్తం మీద అంతకు పలు రెట్ల సంఖ్యలో సిక్కులపై మారణకాండ జరిగినట్లు పలు వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణదేవాలయం కేంద్రంగా ఉన్న వేర్పాటువాదులు లక్ష్యంగా ఇందిర సర్కారు చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ అనంతరం ఆమె హత్య, సిక్కుల మారణకాండ చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది.