మందిర నిర్మాణం పూర్తైంది.. శక్తిమంతమైన దేశ నిర్మాణం జరగాలి : మోహన్ భాగవత్

VSK Telangana    02-Dec-2025
Total Views |

 
mohan ji

విశ్వ కల్యాణం కాంక్షించి అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తైందని, ఇక ఇప్పుడు మరింత శక్తిమంతమైన, అందమైన దేశ పునర్నిర్మాణం జరగాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ ఆకాంక్షించారు. ఆరెస్సెస్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని పూణెలోని యశ్వంతరావు చవాన్ ఆడిటోరియంలో ఆదిత్య ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో ‘‘కృతజ్ఞత సమ్మాన్’’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ భాగవత్ తో పాటు శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు కూడా హాజరై, ఆశీ: పూర్వక సందేశాన్ని అందించారు. అలాగే ఆదిత్య ప్రతిష్ఠాన్ అధ్యక్షుడు శంకర్ అభ్యంకర్, అపర్ణ అభ్యంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కృతజ్ఞతా పురస్కారాన్ని స్వీకరిస్తూ.. మోహన్ భాగవత్ మాట్లాడారు. సమాజం కోసం పనిచేసే సంఘ కార్యంలో కృతజ్ఞత లేదా అహంకారం అనేవి వుండవన్నారు.సమాజం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం సుసంపన్నమవుతుంది కాబట్టే, సంఘ్ యావత్ సమాజాన్ని సంఘటితం పరచాలని పని చేస్తోందని వివరించారు. దేశం బలంగా వున్నప్పుడే ప్రపంచంలో ఆనందం, శాంతి వుంటాయని పునరుద్ఘాటించారు.


mohan ji23 

అయితే.. సంఘ్ మాత్రమే దేశ హితం కోసం పాటుపడుతుందని తాము చెప్పమని, కానీ.. సమాజం బలంగా నిలబడినప్పుడే దేశం కూడా నిలబడుతుందన్నదే తమ విశ్వాసమని ప్రకటించారు. కష్ట సమయాల్లో సమాజం ఆరెస్సెస్ కి అండాదండా అందించిందని, దాని కారణంగా సంఘ్ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.


mohan ji2 

స్వయంసేవకులు తమ ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి, సంఘ్ ను నిర్మించారని అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సంఘ్ అన్న మర్రి చెట్టును విస్తరించడానికి తమ జీవితాలను కూడా త్యాగం చేశారన్నారు. ఇందులో భాగంగానే హెడ్గేవార్, దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రచారక్ గా వుండిపోయారని, అలాగే గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కూడా స్వయంసేవకలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, సంఘాన్ని నిర్మించారన్నారు. వారందరికీ కృతజ్ఞతను ప్రకటించాలన్నారు. కష్ట నష్టాలు, సుఖ దు:ఖాలు ఎదురైనప్పుడు కూడా స్వయంసేవక్ పూర్తి చిరునవ్వుతోనే సమాజ కార్యాన్ని చేస్తారన్నారు.