ఏబీవీపీ తెలంగాణ ఆధ్వర్యంలో ‘‘సామాజిక సమరసత దివస్’’

VSK Telangana    07-Dec-2025
Total Views |

 abvp

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సామాజిక సమరసత దివస్ జరిగింది. సికింద్రాబాద్ జిల్లా, అల్వాల్ నగర శాఖ ఆధ్వర్యంలో శ్రీ అభ్యాస్ జూనియర్ కాలేజీలో ఒక కార్యక్రమం జరగ్గా, కాకతీయ యూనివర్శిటీ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో మరో కార్యక్రమం జరిగింది. అల్వాల్ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఏబీవీపీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా మంత్రి చిరిగె శివకుమార్ హాజరుకాగా, కాకతీయ యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏబీవీపీ అఖిల భారతీయ సహ సంఘటనా మంత్రి బాలకృష్ణ హాజరయ్యారు.
 
 
Abvp Sec Balakrishna
 
ఈ సందర్భంగా దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా మంత్రి చిరిగె శివకుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొని అవమానాలను తట్టుకొని తన కఠోర శ్రమతో సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని అదిరోహించారన్నారు. ఆ తరువాత సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపడానికి సమానత్వాన్ని నెలకొల్పడానికి ఎంతో కృషి చేశారన్నారు. అలాగే కులమత బేధాలు లేకుండా లింగ భేదాలు లేకుండా సమాజమంతా ఒక్కటే అని చాటిచెప్పినటువంటి ఆ మహానీయుడు అని కొనియాడారు. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ వర్ధంతి రోజున సామాజిక సమరసత దివస్ జరుపుకుంటున్నామని వివరించారు. మనమంతా అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో సమానత్వం పెంపొందించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో అంబేద్కర్ గారిని కొంతమంది ఒకే కులానికి ఒకే మతానికి చెందిన వాడిగా చిత్రీకరిస్తూ అంబేద్కర్ స్థాయిని తగ్గించే కుట్రలు చేస్తున్నారుని మండిపడ్డారు. కానీ అంబేద్కర్ ఒక కులానికో, మతానికో చెందిన వ్యక్తి కారని, అంబేద్కర్ భారతదేశంలో ఒక సంపద అని అభివర్ణించారు.
 

abvp 

ఇక.. కాకతీయ యూనివర్శిటీ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏబీవీపీ అఖిల భారతీయ సహ సంఘటనా మంత్రి బాలకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి దశ,దిశ చూపే రాజ్యాంగాన్ని అందించిన "భారతరత్నం" అని అన్నారు. అస్పృశ్యతను ఎదుర్కొన్న అంబేద్కర్, అస్పృశ్యతను రూపు మాపేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక ఆర్టికల్‌ను తీసుకొచ్చారని పేర్కొన్నారు. తను అనుభవించిన బాధలు ఈ దేశంలో ఎవరు అనుభవించలేదని,కానీ తను అనుభవించిన బాధల్ని ఈ సమాజం ఎదుర్కోవొద్దని అనునిత్యం పరితపించిన మహానుభావుడు అని కొనియాడారు. నేను ఈ దేశంలోనే పుట్టానని, ఈ దేశ పౌరునిగానే చస్తానని వెలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఈ దేశానికి సౌభ్రాతృత్వంతో కూడిన సమానత్వం అవసరం అని విద్యార్థులకు పిలునిచ్చారు. ఈ దేశంలో అంబేద్కర్‌ని అవమానించినవారే ఆయనకు వీరవిధేయులుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.అంబేద్కర్ అందరి వాడని, ఏ ఒక్క వర్గానికో, కులానికో, మతానికో చెందిన వ్యక్తి కాదని బాలకృష్ణ అన్నారు.


abvp