సంకుచిత స్థితి నుంచి భారతీయులం అన్న భావనకు ఎదగాలి : జస్టిస్ భీమపాక నగేశ్

VSK Telangana    07-Dec-2025
Total Views |

 
samarasatha

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ‘‘సమతా దినోత్సవం’’ జరిగింది. హైదరాబాద్ లోని బద్రుకా కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరూ స్వేచ్చ,సమానత్వం, సౌభ్రాతృత్వం,న్యాయంతో జీవించడానికి మనకు మనమే రూపొందించుకున్న విధానమే రాజ్యాంగమని,కులం అనే సంకుచిత స్థితి నుండి,భారతీయులమనే విశాల భావానికి ఎదగాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని, వేద,ఉపనిషత్,పురాణ, ఇతి హాసాల్లో లేని వివక్షతను నేడు చూస్తున్నామని విచారం వ్యక్తం చేశారు.

సమాజంలో సామాజిక మార్పు కనిపిస్తున్నప్పటికి, అసమానతలు పూర్తిగా నిర్మూలనం చేసే వరకు కష్ట పడాలని సూచించారు. శ్రీ రాముడు శబరి,గుహులతో వ్యవహరించిన విధానంలో,శ్రీ కృష్ణుడు అర్జునుని నిమిత్త మాతృనిగా చేసుకుని బోధించిన గీతా వాక్యంలో ' చరా చర సృష్టిలో తానే నిండి వున్నానని ' చెప్పటం ద్వారా అందరిలో భగవంతుడు ఉన్నాడనే సమరసతా భావాన్ని దర్శింప చేశారని గుర్తు చేశారు. అలాగే పారిశుధ్య కార్మికులు ప్రజలు విసర్జించిన పదార్థాలను ఎత్తి,శుభ్రం చేస్తారని, అందుకే గొప్ప వారిగా భావించాలని,అస్పృష్యులుగా చూడొద్దని సూచించారు. స్వామి వివేకానంద దేశంలోని నిర్భాగ్యులను ఆదుకున్నప్పుడే మానవత్వం వెల్లి విరుస్తుందని పదే పదే చెప్పేవారని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

samarasatha2 

ఇక.. గౌరవ అతిథిగా విచ్చేసిన ఐఏఎస్ అధికారి పి. నరహరి మాట్లాడుతూ సనాతన ధర్మం లోని సూత్రాలను రాజ్యాంగంలో పొందు పరచి,కుల మత వర్గాల కతీతంగా భారత ప్రజలందరికి మేలు చేకూర్చే హక్కులు,బాధ్యతలను మనకు అందించిన రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ అని తెలియజేశారు. రాజ్యాంగంలో ప్రతి అధ్యాయం పుట పైన ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్ ద్వారా శ్రీరాముడు,శ్రీ కృష్ణుడు ఇలా 24 చిత్రాలను వేయించి,ధర్మ బద్ధంగా జీవించాలని ప్రజలకు పరోక్షంగా బోధించిన దేశ భక్తుడు అంబేద్కర్ అని అన్నారు.

అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జీ మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే వారి గురించి మాట్లాడాలని సూచించారు. ఎవరో ఏదో అన్నారని,ఏదో రాశారని అదే వల్లె వేసి మాట్లాడటం వల్ల అనర్థా లు జరుగుతాయని అన్నారు. వివక్ష లేని సమాజ నిర్మాణానికి అందరూ తమ వ్యవహారం ద్వారా, వ్యక్తిగత ఉదాహరణల ద్వారా ప్రయత్నం చేయాలని కోరారు.


samarasatha23 

పద్మశ్రీ అవార్డు గ్రహీత త్రిపుర నేని హనుమాన్ చౌదరి ప్రసంగిస్తూ, దేశ విభజనలో జిన్నా పాత్ర,అప్పటి ముస్లిం లీగ్ పాత్రను అంబేద్కర్ తెలుపుతూ దేశ విభజన గాథ అను పుస్తకాన్ని రాశారని పేర్కొన్నారు.

ఇక.. ప్రత్యేక ఆహ్వానితులు ప్రభుత్వ ప్లీడర్ ఫర్ హోమ్,న్యాయవాది మహేష్ రాజే రాజ్యాంగ పీఠిక లోని అంశాల వెనక నున్న గొప్పదనాన్ని వివరించారు.


samarasatha234 

ఇదే క్రమంలో అఖిల భారత కళా విభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ తెలంగాణ లో గత పది సంవత్సరాలుగా సమరసతాకార్యక్రమాల ద్వారా వచ్చిన పరిణామాలు తెలియ జేశారు.