ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా 1742 లో విశ్వాసం కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన 14 ఏళ్ల బాలుడు వీర్ హకీకత్ రాయ్ కథ గుర్తుకొస్తుంది. ధైర్య సాహసాలు, త్యాగానికి శాశ్వత చిహ్నంగా నిలిచిపోయాడు హకీకత్. బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా తీవ్రంగా ఈ బాలుడు పోరాటం చేశాడు. లాహోర్ లో అతని బలిదానం మొట్ట మొదటి బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా ధిక్కార స్వరంగా పరిగణిస్తారు. అతని అచంచల విశ్వాసాలు, మొక్కవోని ధైర్య సాహసాలతో నిండిన బాలుడి కథ స్ఫూర్తినిస్తూనే వుంటుంది.
పంజాబ్ లోని సియాల్ కోటలో 1728 లో హకీకత్ రాయ్ జన్మించాడు. దేశభక్త, హిందూ కుటుంబంలో పెరిగాడు. అతని తల్లిదండ్రులు బగ్మల్, కౌరాదేవి. విపరీతమైన ప్రేమతో పెంచుతూనే... నైతిక విలువలు, దేశభక్తిని చెప్పేవారు. చిన్నతనం నుంచే హకీకత్ కూడా వీటిని నేర్చుకోవడానికి శ్రద్ధ పెట్టేవాడు. నాలుగు సంవత్సరాల వయస్సులోనే భగవద్గీత, హిందూ గ్రంథాల పఠనం, పురాణేతిహాసాల కథలను కంఠస్థం చేశాడు. ఇదే సమయంలో చాలా హిందూ కుటుంబాలు తమ పిల్లలను విద్యాభ్యాసం కోసం ఇస్లామిక్ మదర్సాలకి పంపేవారు.ఈ కట్టుబాటును అనుసరించి, హకీకత్ రాయ్ మదర్సాలో చేరాడు, అక్కడ అతను తన చదువులో రాణించాడు.
అయితే.. ఈ సమయంలోనే ఓ ఘటన జరిగింది. అతడ్ని పూర్తిగా మార్చేసింది. ఓ రోజు హకీకత్ తన తోటి ముస్లిం విద్యార్థులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఎందుకంటే ముస్లిం విద్యార్థులు హిందూ దేవీ దేవతలను, సంప్రదాయాలను తీవ్రంగా అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అపర శక్తి స్వరూపిణి దుర్గామాతను అవమానించారు. హకీకత్ కి ఏమాత్రం నచ్చలేదు. వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ముస్లిం విద్యార్థులు వినలేదు. ‘‘నేను మీ మతపరమైన దేవుళ్ల గురించి చెడుగా మాట్లాడానా? మాట్లాడితే మీరు సహిస్తారా? అంటూ హకీకత్ ప్రశ్నించాడు. అంతే ముస్లిం విద్యార్థులకు కోపం వచ్చింది. హకీకత్ రాయ్ ఇస్లాం దైవ దూషణ చేశాడంటూ ఆరోపణలకు దిగారు.
ఈ విషయం ముదిరిపోయింది. హకీకత్ ను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని ఖాజీ (ఇస్లామిక్ న్యాయమూర్తి) అతను క్షమించరాని నేరానికి పాల్పడ్డాడని-ఇస్లాంను అగౌరవపరిచాడని ప్రకటించాడు. తనను తాను రక్షించుకోవడానికి ఏకైక మార్గం హిందూ మతాన్ని త్యజించి ఇస్లాం స్వీకరించడం. లేకుంటే ఉరిశిక్షే మార్గమని బెదిరింపులకు దిగాడు. దీంతో హకీకత్ తండ్రి లాహోర్ గవర్నర్ జకారియా ఖాన్ ను జోక్యం చేసుకోవాలని కోరారు. అయినా లాభం లేకపోయింది. అప్పటికే హకీకత్ ను ఉరి తీయాలని ముస్లింలు తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు.
అయితే.. హకీకత్ కి కొన్ని మినహాయింపులు ఇచ్చారు.అందులో మొదటిది ఇస్లాంలోకి మారడం 2. మరణ శిక్షను స్వీకరించడం.. ఈ సమయంలో హకీకత్ అనే బాలుడి చేతులు గొలుసులతో కట్టేసి, జడ్జి ముందు నిలుచోబెట్టారు. అయినా హకీకత్ ఏమాత్రం వెరవకుండా ధైర్యంతో జడ్జి ముందు వాదించాడు.
జడ్జి ఖాజీ మాట్లాడుతూ... ‘‘ఇస్లాం స్వీకరిస్తావా? చస్తావా? ’’ అంటూ ప్రశ్నించారు.
బాలుడు హకీకత్ ఏమాత్రం వెరవకుండానే సమాధానం ఇచ్చాడు. మీ ముస్లింలు చావరా? ఇస్లాంను స్వీకరిస్తే చావే దరిచేరదా? ఎప్పటికీ జీవించే వుంటామా? అంటూ ప్రశ్నించారు. అప్పుడు జడ్జి ఖాజీ.. మరణం అనివార్యమంటూ హూంకరించాడు.
అప్పుడు హకీకత్ ‘‘మరణమే తథ్యం అయితే.. నా హిందూ విశ్వాసాలను నేను ఎందుకు వదులుకోవాలి? హిందువుగానే చనిపోతాను. తప్ప మతం మారను’’ అంటూ తేల్చి చెప్పేశాడు.
దీంతో హకీకత్ ను బహిరంగంగానే ఉరితీయడానికి అంతా సిద్ధమైంది. పునరాలోచించుకోవాలని తల్లిందడ్రులు వేడుకున్నారు. అయినా... ఆ పిల్లవాడితో సహా... ఎవ్వరూ మనసులు మార్చుకోలేదు. హకీకత్ రాయ్ తల్లి కళ్ల నుంచి కన్నీటి ధార. అయినా హకీకత్ సుదృఢంగానే నిల్చున్నాడు. అతని కళ్లు అచంచలమైన విశ్వాసంత అచ్చు అగ్నిలాగే ప్రతిబింబించాయి. సరిగ్గా 1742 లో వసంత పంచమి పర్వదినం నాడే బహిరంగంగానే హకీకత్ కి ఉరిశిక్ష విధించారు.
బాలుడి బలిదానం తర్వాత లాహోర్ లో అతని గౌరవార్థం స్మారకాన్ని నిర్మించారు. అక్కడి ప్రజలు అతని త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి వసంత పంచమి రోజున అక్కడికి వెళ్లి... నివాళులు అర్పిస్తారు. అతని ధైర్య సాహసాలను, త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు.ఆయన జన్మస్థలమైన సియాల్‌కోట్‌లో మరో స్మారక చిహ్నం నిర్మించారు.