విదేశీయుల్ని ఇంకెన్నాళ్లు నిర్బంధ కేంద్రాల్లో వుంచుతారంటూ సుప్రీం కోర్టు అసోం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వారిని స్వస్థలాలకు పంపడానికి ఏమైనా ముహూర్తం కావాలా? అంటూ ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో వుంచిన 63 మంది వలసదారులను రెండు వారాల్లోగా పంపించేయాలని న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అయితే.. వారి చిరునామాలు తెలియపోవడం వల్లే జాప్యం అవుతోందని అసోం ప్రభుత్వం సుప్రీంకి నివేదించింది.
దీంతో సుప్రీం కోర్టు స్పందిస్తూ..చిరునామా లేకున్నా సరే.. వారిని వెంటనే పంపేయాలని, ఇలాగే ఎన్ని రోజులు నిర్బంధ కేంద్రాల్లో వుంచుతారని ప్రశ్నించింది. వారి పౌరసత్వ పరిస్థితి ఏమిటో మీకు తెలుసని,అయినా చిరునామా కోసం ఎన్నాళ్లు వేచి చూస్తారంటూ సుప్రీం నిలదీసింది. అసలు చిరునామా అన్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే కాదని, అలాగే వారిని జీవితాంతం కేంద్రాల్లో వుంచుతూ పోషించలేం కదా? అని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అక్రమ వలసదారుల బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించాలని సుప్రీం ఆదేశించింది.
మరోవైపు చిరునామా విషయంలో జస్టిస్ అభయ్ ఓకా మాట్లాడుతూ.. ‘‘మీరు మొదట అలాంటి వార్ని దేశ రాజధానికి రప్పించండి. ఆ వ్యక్తిది పాకిస్తాన్ అని అనుకోండి. మీకు పాక్ రాజధాని తెలియదా? ఇంకా ఎన్నాళ్లు వుంచుతారు?’’ అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం వారిని శాశ్వతంగా నిర్బంధ కేంద్రాల్లో వుంచలేరని పేర్కొంది. అసోంలో విదేశీలయు కోసం నిర్బంధ కేంద్రాలు వున్నాయని, ఇప్పటి వరకూ ఎంత మందిని బహిష్కరించారో చెప్పాలని ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో వుంచిన 63 మందిని రెండు వారాల్లోగా బహిష్కరించడం ప్రారంభించాలని, దీనికి సమ్మతిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని అసోం ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది.