‘‘అమితాబ్ క్షమాపణలు చెప్పినా.. జయా బచ్చన్ కి పాప విముక్తే లేదు..’’

VSK Telangana    04-Feb-2025
Total Views |
 
jaya
 
అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడిగా వున్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మహా కుంభమేళాను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో భక్తులు, జాతీయవాదులు ఆమెపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. హిందువుల మనోభావాలను అవమానపరుస్తున్నారని, నదీమ తల్లులను అవమానించే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. మౌని అమావాస్య నాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై స్పందిస్తూ మహా కుంభమేళాను అవమానపరిచే వ్యాఖ్యలు చేశారు.
 
కుంభ్ లో నీరు అత్యంత కలుషితమైపోయిందని, తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో విసిరేస్తున్నారని, అందుకే కలుషితమైందంటూ కామెంట్స్ చేశారు. ఇదే నీరు అక్కడి ప్రజలకు చేరుతోందని, దీనిపై స్పష్టతే లేదన్నారు. అత్యంత కలుషితమైన నీరుందంటే అది ప్రయాగ్ రాజ్ లోనే అంటూ జయాబచ్చన్ నిరాధార ఆరోపణలకు దిగారు.
 
‘‘ఈ సందర్భంలో అత్యంత కలుషితమైన నీరు ఎక్కడుంది? మహా కుంభ్ లో వుంది. దీనిపై ఎవ్వరూ వివరణే ఇవ్వడం లేదు. నదిలోకి మృతదేహాలను విసిరేస్తున్నారు. తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను అందులో విసిరేస్తున్నారు.ఈ నీరే ప్రజలకు చేరుతోంది. అసలు విషయంపై నోరు మెదపడం లేదు. సామాన్యులకు అక్కడ సౌకర్యాల్లేవ్’’ అంటూ జయాబచ్చన్ అన్నారు.
 
దీనిపై నెటిజన్స్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. జయా బచ్చన్ మానసిక స్థితి సరిగ్గా లేదని, సమతౌల్యాన్ని కోల్పోయారని మండిపడుతున్నారు. అలాగే అమితాబ్ జీ.. దయచేసి మంచి వైద్యుడ్ని సంప్రదించండి అంటూ విసుర్లు చేస్తున్నారు.

వారిష్ కుమార్ అనే నెటిజన్ స్పందిస్తూ.. ‘‘హిందూ ధర్మాన్ని ఆమె అవమానపరిచారు. తప్పుడు ఆరోపణలు చేశారు. మృత దేహాలను విసిరేస్తున్నారంటూ తప్పుడు, నిరాధార ఆరోపణలకు దిగుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నారు.

రమాకాంత్ రాయ్ అనే నెటిజన్ స్పందిస్తూ... ‘‘ఒకప్పుడు జయా బచ్చన్ ని గౌరవించేవాడ్ని. అమాయక నటి అని భావించేవాడ్ని. ఆమె ప్రతి హావభావమూ మనోహరమే. కొన్ని రోజులుగా మాత్రం తద్భిన్నంగా ప్రవర్తిస్తోంది. మహాకుంభ్ కి సంబంధించి తప్పుడు ప్రచారలు చేస్తున్నారు. సహనంతో వ్యవహరించడం లేదు. రాజకీయాల్లో ఇంత దిగజారుడు పనికిరాదు. అమితాబ్ స్వయంగా క్షమాపణలు చెప్పినా... జయా బచ్చన్ కి పాప విముక్తి లభించదు’’ అని విరుచుకుపడ్డారు.

సాధనా సక్సేనా అనే నెటిజన్ స్పందిస్తూ... ‘‘ఆమె మానసిక స్థితి బాగోలేదు. ప్రపంచం మొత్తం మహా కుంభ్ ని చూస్తోంది. మీడియాలో కూడా అద్భుతంగా చూపిస్తున్నారు. ఇదంతా జయా బచ్చన్ కి కనిపించడం లేదు. నీటిలో మృతదేహాలను విసిరేసే వుంటే.. అవి ఉబ్బి... బయటకి తేలుతూ కనిపించేవి. అందరికీ కనిపించేవే. అర్థం పర్థం లేని మాటలు. రుజువులే లేవు’’ అని విరుచుకుపడ్డారు.