మతం మారేవారికి, అక్రమ మత మార్పిళ్లను ప్రోత్సహించే వారి విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిళ్లను నిరోధించేందుకు చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ బిల్లు 2024 (రాజస్థాన్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజయన్ బిల్లు 2024) ను తీసుకొచ్చింది. దీనిని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి, ఆమోద ముద్ర వేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అయితే.. 2024 నవంబర్ లోనే ఈ బిల్లు ముసాయిదాను భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. మత మార్పిడి చేసుకోవాలని భావించిన వారు దాదాపు రెండు నెలల ముందే జిల్లా కలెక్టర్ ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఎవ్వరి ఒత్తిడీ దీని వెనుక లేదని, తమంతట తామే స్వచ్ఛందంగా మతం మారాలని నిర్ణయించుకున్నామంటూ కలెక్టర్ ముందు వాంగ్మూలం ఇవ్వాలి. అప్పుడే వారికి మత మార్పిడికి తగిన అనుమతినిస్తారు. అలాగే మత మార్పిడి కోసమే జరిగే వివాహాలను చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అలాగే అది లవ్ జిహాద్ కిందికి వెళిపోతాయి. అలాంటి వివాహాన్ని ఫ్యామిలీ కోర్టులు రద్దు కూడా చేసే అధికారం వుంటుంది. అలాగే ఈ బిల్లు మోసపూరిత మార్గాల ద్వారా, బలవంతంగా మత మార్పిళ్లు చేసే వారిని నాన్ బెయిలబుల్ నేరంగా కూడా పేర్కొంటుంది. నిందితులకు వెంటనే బెయిల్ దొరకడం చాలా కష్టంగా మారిపోతుంది.
వీటన్నింటితో పాటు బలవంతంగా మతం మారినట్లు తేలితే మాత్రం వారు 5 లక్షల పరిహారం కట్టాల్సి వుంటుందని కూడా ఈ బిల్లులో వుంది. అంతేకాకుండా బలవంతంగా మతం మార్చినట్లు ఏ వ్యక్తి అయినా తేలితే ఆయన 5 లక్షల రూపాయలు పరిహారం ముట్టజెప్పాల్సి వుంటుంది.ఓ వేళ షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వారితోపాటు మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే.. రెండు నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 25 వేల వరకు జరిమానా సైతం విధించే విధంగా ఈ బిల్లును రూపొందించారు.