తిరుమల, అరసవెల్లిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు

VSK Telangana    04-Feb-2025
Total Views |
 
 
ttd
తిరుమలలో రథ సప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు.రథ సప్తమి వేడుకల్లో ప్రథమ వాహనంగా సూర్య నారాయణుడు, సూర్య ప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్య భగవానుడు ఉదయం సమయంలో శ్రీవారి పాదాలపై ప్రసరించారు. మరోవైపు భారీ సంఖ్యలో భక్తులు, వీఐపీలు తరలి రావడంతో తిరుమల రద్దీగా మారింది. రథ సప్తమికి రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఎండ తీవ్రతతో ఇబ్బంది కలగకుండా షెడ్లు ఏర్పాటు చేసిన టీటీడీ, మాడ వీధుల్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ చేయనుంది. రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు అన్న ప్రసాదాలు పంపిణీ నిరంతరంగా కొనసాగించనుంది.

ttd2 
 
మరోవైపు అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానంలోనూ రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పర్వదినం సందర్భంగా సాధారణ భక్తులతో పాటు ప్రముఖులు కూడా సూర్య నారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు శంకర్, గోవిందరావు, గౌతు శిరీష పాల్గొన్నారు. 7 గంటలకు ప్రారంభం కానున్న స్వామివారి నిజరూప దర్శనం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి క్యూ కట్టడంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి.