టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కొత్త వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ విరామ సమయంలో మహమ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగడంపై కొందరు ముస్లిం మతపెద్దలు అతడిని తప్పుపట్టారు. రంజాన్ మాసంలో రోజా పాటించకుండా డ్రింక్ తాగి షమీ పాపం చేశాడని జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లిం యువకుడు, యువతి ఉపవాసం చేయాలని షరియత్ లో ఉందని.. ఎంతో ఆరోగ్యంగా ఉన్న షమీ మ్యాచ్ ఆడుతూ ఎనర్జీ డ్రింక్ తాగి పెద్ద పాపం చేశాడని ఆరోపించాడు. అయితే ఈ విషయంపై షమీని కొందరు తప్పుపడుతుండగా.. మరికొందరు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ కూడా షమీకి మద్దతుగా నిలిచాడు. ఎక్స్ వేదికగా జావేద్ స్పందిస్తూ.. షమీ సాహెబ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మీరు వాటర్ తాగడంపై కొందరూ ముర్ఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ మూర్ఖులను పట్టించుకోకండి. అది వాళ్ల పని కాదు. మనందరినీ గర్వపడేలా చేస్తున్న గొప్ప భారత జట్టులో మీరు ఒకరు. నీకు టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు అంటూ జావేద్ తెలిపాడు. మరోవైపు షమీ బంధువు ముంతాజ్ కూడా అతనికి మద్దతుగా నిలిచాడు.