అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లి పోలీసులు హిందువుల భజనపై ఆంక్షలు విధించారు.నమాజ్ సమయంలో హిందువులు భజన చేయడం ద్వారా అక్కడ మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం వుందని పోలీసులు తమ ఉత్తర్వుల్లో పేర్కొంటూ.. ఇళ్లలోనే శాంతియుతంగా భజనలు చేసుకోవాలని సూచించారు.
లక్కిరెడ్డి పల్లి మండలం పోలీసుల నోటీసుల ప్రకారం... టౌన్ మదీన నగర్ లోని మదీన మసీదు వద్ద నివాసం వుంటున్న హిందువులకు, ముస్లింలకు మధ్య వివాదం నడుస్తోందని, దీంతో పోలీసులు, రెవిన్యూ అధికారులు పీస్ మీటింగ్ కూడా నిర్వహించినట్టు, ఇరు వర్గాలకూ నచ్చజెప్పినట్లు పేర్కొన్నారు. సమస్యను సర్దుబాటు చేశామని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ మసీదు వద్ద పోలీస్ పికెటింగ్ నడుస్తోందని, పికెట్ డ్యూటీలో వున్న పోలీస్ వారు హిందువుల ఇళ్లలో భజన చేస్తున్నారని, ముస్లిం సమాజం నమాజ్ చేసే సందర్భంలో వారికి ఇబ్బందులు కలుగుతోందని తమ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ భజనలతో ప్రస్తుతం శాంతియుతంగా వున్న వీధిలో మళ్లీ, ఇరు వర్గాల మధ్య ఇబ్బందులు కలిగి, శాంతిభద్రతల సమస్యకి దారి తీసే అవకాశం వుందని నోటీసుల్లో తెలిపారు.
అంతేకాకుండా ఈ ఉత్తర్వుల్లో తాజాగా జరిగిన రాయచోటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. వీరభద్ర స్వామి పారపేట సందర్భంగా స్వామి వారి ఊరేగింపులో కొంతమంది ఆకతాయిలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారు. ఆ సమయంలో ఇరు వర్గాలలోని మత పెద్దలు వారించినా, ఆకతాయిలు బేఖాతర్ చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారని నోటీసుల్లో ఉటంకించారు.
శాంతి భద్రతల దృష్ట్యా హిందువులు ఇళ్లలోనే ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా, శాంతియుతంగా భజన కార్యక్రమాలు చేసుకోవాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్నారు. ఇలా కాకుంటే, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నోటీసులపైనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పోలీసులు హిందూ సంప్రదాయాలను నియంత్రిస్తున్నారని, ఈ పంథాను ఎంచుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరి ఆరాధనా పద్ధతులు వారివని అంటున్నారు.
మరోవైపు ఈ పోలీసుల నోటీసులపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF) స్పందించింది. పోలీసుల పక్షపాత వైఖరిని ఖండించింది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సంతుష్టీకరణ రాజకీయాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ప్రకారం అందర్నీ సమానంగా చూడాల్సింది పోయి, శాంతిభద్రతల సాకుతో హిందువుల ఆరాధనా పద్ధతులను కాలరాస్తున్నాయని, సంతుష్టీకరణ రాజకీయాలకు ఇదే సజీవ సాక్ష్యమంటున్నారు. ఏపీ ప్రభుత్వం పౌరులందర్నీ సమానంగా చూస్తుందా? రక్షిస్తుందా? లేదా... రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, బుజ్జగింపులు చేస్తూనే వుంటారా? అన్నది చెప్పాల్సి వుంది.