శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదేళ్లలో అక్షరాలా రూ. 400 కోట్ల పన్నులు చెల్లించి ప్రభుత్వానికి అండగా నిలిచింది. మతపరమైన పర్యాటకం అనూహ్యంగా పెరగడంతో ఈ భారీ మొత్తం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం వెల్లడించారు. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుండి 2025 ఫిబ్రవరి 5వ తేదీ మధ్య కాలానికి ఈ పన్నులు చెల్లించినట్లు ఆయన తెలిపారు.ఇందులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ. 270 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 130 కోట్లు ఇతర పన్నుల రూపంలో చెల్లించినట్లు ఆయన వివరించారు
అయోధ్య ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోందని, భక్తులు, పర్యాటకుల సంఖ్య పదింతలు పెరిగిందని రాయ్ సంతోషం వ్యక్తం చేశారు. అయోధ్య ఒక ప్రధాన మతపరమైన పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయని ఆయన తెలిపారు.
మహా కుంభమేళా సమయంలో ఏకంగా 1.26 కోట్ల మంది భక్తులు అయోధ్యను దర్శించుకున్నారని ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరంలో అయోధ్యకు 16 కోట్ల మంది సందర్శకులు రాగా, వారిలో 5 కోట్ల మంది శ్రీ రామ మందిరాన్ని సందర్శించి పులకరించారని రాయ్ తెలిపారు. ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలు, రికార్డులను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధికారులు నిరంతరం తనిఖీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.
అయోధ్యలో మతపరమైన పర్యాటకం వృద్ధి చెందడానికి, ఆలయ ట్రస్ట్ పారదర్శక ఆర్థిక నిర్వహణకు ఈ భారీ పన్నుల చెల్లింపు ఒక నిదర్శనంగా నిలుస్తుంది.