దక్షిణ కొరియా నుంచి వచ్చిన 78 మంది ప్రతినిధుల బృందం అయోధ్య రామాలయాన్ని సందర్శించి, సరయూనది వద్ద హారతి కార్యక్రమంలో పాల్గొంది. వీరు దక్షిణ కొరియాలోని కరక్ తెగకు చెందినవారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అయోధ్యకు చేరుకొని రాణీ ఉద్యానవనాన్ని సందర్శించి తమ సాంస్కృతిక మూలాలను స్మరించుకున్నారు. అక్కడ రెండున్నరేళ్ల క్రితం నిర్మించిన హెయో రాణి స్మారక చిహ్నానికి నివాళులు అర్పించారు.
2000 సంవత్సరాల క్రితం అయోధ్యకు చెందిన రాణి సురి రత్న 4,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొరియా చేరుకున్నాక అక్కడ రాజు కిమ్ సురోను పెళ్లాడారని ఐతిహ్యం. వీరు గయ రాజ్యాన్ని స్థాపించారు. రాణి సురి రత్న వారసులమనీ, తమ మూలస్థానం అయోధ్య అనీ చెప్పే 60 లక్షలమంది కరక్ తెగవారు దక్షిణ కొరియాలో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, దక్షిణ కొరియాలోని గిమ్హే నగరపాలిక కలిసి 2001లో సరయూనది ఒడ్డున ఒక స్మారకచిహ్నం కూడా నిర్మించారు. ఏటా కొందరు కరక్ ప్రతినిధులు అయోధ్యకు వచ్చి అక్కడ నివాళులు అర్పిస్తారు.