సర్ సి వి రామన్ చేసిన పరిశోధనల కారణంగా రామన్ ఎఫెక్ట్ అనే దృగ్విషయం 28 ఫిబ్రవరి 1928 న ఆవిష్కరించబడింది. దానికి గుర్తుగా ప్రతి ఏటా ఆ రోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాము. సర్ సి వి రామన్ తర్వాత కాలంలో, శివరామ కృష్ణన్ పంచరత్నం కనుగొన్న పంచరత్నం రేఖాగణిత దశ నుంచి, ఇటీవలి కాలంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ చే అయోధ్యలో చేపట్టిన సూర్య తిలకం ప్రాజెక్ట్ వరకు ఎన్నో అంశాలకు ఈ ఆవిష్కరణ ప్రేరణ కలిగించింది. రామన్ సమకాలీకుడైన సత్యేంద్రనాథ్ బోస్ చేసిన క్వాంటమ్ పరిశోధనలు ‘బోసాన్’ అనే కణాల ప్రవర్తన గురించి ప్రపంచానికి తెలియపరిచాయి. పదార్థాలకు ఉండే ఒక ప్రత్యేక స్థితిని ‘బోస్-ఐన్ స్టీన్ స్థితి’ గా గుర్తించారు. అయితే వీటికి పూర్వం, భారతీయులు తెలుసుకున్న కాంతి సంబంధ దృగ్విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
కోణార్క సూర్య దేవాలయంలో కాలాన్ని కొలిచే చక్రం
ఉదాహరణకు తెలంగాణ లోని నల్గొండ జిల్లా పానగల్లు వద్ద ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయం యొక్క నిర్మాణం భారతీయ వైజ్ఞానిక మేధస్సుకు అద్దం పడుతుంది. ఈ ఆలయం, సుమారు వేయి సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. కాంతి యొక్క నియమాలు అర్థం చేసుకుని పరిక్షేపణ సిద్ధాంతం తో నిర్మించిన ఈ ఆలయంలో, సూర్యుని దిశ మారుతూ ఉన్నా, రోజంతా స్థిరంగా ఉండే నీడ కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సుమారు పది సంవత్సరాల క్రితం, శేషగాని మనోహర్ అనే భౌతికశాస్త్ర ఉపన్యాసకుడు ఆలయ నిర్మాణాన్ని పరిశీలించి, కాంతి పరిక్షేపణ ద్వారా ఈ స్థిరమైన నీడ ఏర్పడుతోందని నిరూపించారు. 19-20 శతాబ్దాల్లో ప్రపంచానికి పరిచయం అయిన ‘కాంతి పరిక్షేపణ’ అనే నియమం, సుమారు వేయి సంవత్సరాలకు పూర్వమే నిర్మించిన భారతీయ ఆలయంలో కనిపిస్తుంది. 11 వ శతాబ్దానికి చెందిన కుందూరు చోళులు, ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ నీడ ఏర్పడటం అనేది కేవలం సాంకేతిక అంశంగానే ఆనాటి ప్రజలు భావించినట్టు, అందుకే తర్వాత కాలంలో కాకతీయ రాజులు సైతం ఇలాంటి ఆలయాలను నిర్మించడానికి ప్రయత్నించినట్లు మనం భావించవచ్చు. తూర్పు వైపు సూర్యదేవుని ఆలయం, పశ్చిమాన శివాలయం, ఉత్తరాన విష్ణువు ఆలయం, దక్షిణాన ప్రవేశ ద్వారం ఉన్న ఇలాంటి ఆలయ నిర్మాణం, ఆనాటి కాలంలో ‘త్రికూటాలయం’ గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో ప్రస్తుతం వరంగల్ వద్ద వేయి స్తంభాల దేవాలయం, షాద్ నగర్ సమీపంలోని త్రికూట ఆలయం, కరీంనగర్ జిల్లాలోని ఆలయాలు ఇలాంటి సాంకేతిక ప్రదర్శన కోసం చేసిన ప్రయత్నం కావచ్చు. వీటిలో కూడా ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్న స్థిర నీడలు ఏర్పరిచే ప్రయత్నం చేసి ఉండవచ్చు. అయితే ఇవి వాటి లక్ష్యాలు చేరుకున్నాయా లేదా అనేది పరిశోధించవలసిన అంశం.
అలాగే గ్రహాలు, నక్షత్రాల చలనానికి సంబంధించిన ప్రాచీన భారతీయ విజ్ఞానం మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. ఉదాహరణకు ఏడవ శతాబ్దంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని అరసవల్లి వద్ద, పదమూడవ శతాబ్దంలో ఒడిషా లోని కోణార్క వద్ద కళింగ రాజుల చే నిర్మించబడిన సూర్య దేవాలయాలు గ్రహచలనాలకు సంబంధించి అప్పటికే భారతదేశంలో ఉన్న అవగాహనను ఈనాటికీ ప్రదర్శిస్తున్నాయి. అరసవల్లి వద్ద ఉన్న సూర్యదేవాలయంలో ప్రతి సంవత్సరం మార్చి మరియు అక్టోబర్ నెలల్లో సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. ఇక్కడ ఆసక్తి ని కలిగించే విషయం, మార్చి నెల 9 నుంచి 11 వ తేదీల్లో ఈ సూర్యకిరణాలు ప్రసరించిన సమయానికి సుమారు తొమ్మిది రోజుల తర్వాత, మార్చి 20-21 తేదీల్లో సూర్యుడు భూమధ్య రేఖ మీదుగా ప్రయాణిస్తాడు. ఇలా సూర్యుడు భూమధ్య రేఖ మీదుగా వెళ్ళడాన్ని ‘విషవత్తు’ అంటారు. మరలా సెప్టెంబర్ 22-23 తేదీల్లో విషవత్తు ఏర్పడిన తొమ్మిది రోజుల తర్వాత అక్టోబర్ 1 నుంచి 3 వ తేదీల మధ్య సూర్య కిరణాలు ఈ ఆలయంలో ప్రసరిస్తాయి. మన భూ గ్రహ చలనానికి సంబంధించి, కచ్చితమైన సమాచారం సుమారు పదమూడు వందల సంవత్సరాల క్రితం ఉండటం పరిశోధించవలసిన అంశం.
కోణార్క సూర్య దేవాలయంలో కాలాన్ని మూడు నిమిషాల కచ్చితత్వంతో కొలవడానికి ఏర్పాటు చేసిన పూసలు
తరువాతి కాలంలో పదమూడవ శతాబ్దంలో ఒడిషా లోని కోణార్క వద్ద కళింగ రాజులు నిర్మించిన మరొక సూర్య దేవాలయం ఇప్పటికీ నిలిచి ఆనాటి శాస్త్ర విఙానాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఆలయ నిర్మాణంలో మెటా మార్ఫిక్ రాళ్ళయిన ఖొండలైట్, క్లోరైట్ మరియు లాటరైట్ ఆధారిత రాళ్ళను ఎక్కువగా ఉపయోగించడం ఆసక్తిని కలిగిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న రథ చక్రాలు సూర్య గడియారాలు గా ఇప్పటికీ స్థానిక సమయాన్ని కచ్చితత్వంతో చూపిస్తాయి. ఆనాడు కాలాన్ని లెక్కించే పద్దతిలో ఉపయోగించబడిన ప్రహర ఆధారంగా ఈ చక్రం ఎనిమిది భాగాలుగా విభజించబడి, ఒక్కో భాగం సుమారు మూడు గంటల నిడివి గల ఒక ప్రహర ని సూచించే విధంగా నిర్మించారు. చక్రం యొక్క అర్ధ భాగం పగటి సమయాన్ని కొలవడానికి సరిపడుతుంది. అయితే, ఈ చక్రాల బాహ్యంలో 480 పూసలు ఉండటం, ప్రాచీన భారతీయ సమయ లెక్కింపు పద్దతిని, ఈ నిర్మాణంలో అత్యంత నేర్పుతో అమర్చినట్లు అవగతం అవుతుంది.
ఒక రోజును 60 ఘటికలు లేదా దండలు లేదా నాడీ సమాహారంగా ప్రాచీన భారతీయులు విభజించారు. ప్రస్తుత కాలమానంలో వీటి విలువ సుమారు 24 నిమిషాలు. పూర్తి చక్రంలో 8 విభాగాలతో ఒక రోజుని అమర్చి నట్లయితే, ఒక ఘటిక సమయం కొలవడానికి 8 పూసలను అమర్చారు. ఒక పూసపైన 3 నిమిషాలు మాత్రమే నీడ పడేలా వాటి పరిమాణాన్ని నిర్ణయించారు. 18వ శతాబ్దం ప్రారంభంలో, న్యూఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని, మధుర మరియు వారణాసిలలో జైపూర్ మహారాజా జై సింగ్ నిర్మింపజేసిన ‘జంతర్ మంతర్’ అనే రాతి నిర్మాణాలు ఖగోళ వస్తువుల పరిశీలనకు, స్థానిక సమయం లెక్కింపుకు, వివిధ ఖగోళ అంశాల పరిశీలనకు ఉపయోగించేవారు. సుమారు 20 పరికరాలతో జైపూర్ వద్ద ఉన్న జంతర్ మంతర్, 18 వ శతాబ్దం లో ప్రపంచంలోనే అతి పెద్ద ఖగోళ పరిశీలనాకేంద్రంగా గుర్తింపు పొందింది. రామ్ సింగ్ మహారాజా పేరుతో ఈ జంతర్ మంతర్ లలో నిర్మించబడిన రామ యంత్రాలు ఖగోళ వస్తువుల దూరాన్ని కొలవడానికి ఉపయోగించిన తీరు ఆనాటి భారతీయుల తార్కిక మేధాశక్తికి చిహ్నాలు. ఇప్పటికీ మిగిలి ఉన్న ఇలాంటి నిర్మాణాలు ప్రాచీన భారతీయ వైజ్ఞానిక శక్తికి ఉదాహరణలు గా నిలుస్తున్నాయి.
-డా. వాడపల్లి దుర్గా రామ పవన్ మరియు డా. బెహరా ప్రసన్న కుమార్