అక్రమ మదర్సాలపై ఉత్తరాఖండ్ చర్యలకు ఉపక్రమించింది. పచ్వా ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న నాలుగు మదర్సాలను అక్కడి ప్రభుత్వం మూసేసింది. ఈ మేరకు సీల్ వేసేసింది. అలాగే అక్రమంగా నిర్మిస్తున్న మసీదుకి కూడా సీల్ వేసేశారు. వికాస్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ బృందంలో మైనారిటీ శాఖ, మదర్సా బోర్డు అధికారులు కూడా వున్నారు.
పరిపాలనా బృందం ఢక్రానీకి చెందిన మదరసా దార్-ఎ-అక్రం, మదరసా మషిగుల్ రహ్మానియా, నవాబ్‌ఘర్‌కు చెందిన మదర్సా ఫైసల్ ఉలూమ్ మరియు దావతుల్ హక్ ను మూసేసింది, సీలు వేసింది. ప్రభుత్వం అనుమతులు లేకుండానే ఈ మదర్సాలు నడుస్తున్నాయని అధికారులు ధ్రువీకరించారు. ఈ మదర్సాలలో పిల్లలు కూర్చోడానికి గానీ, చదువుకోడానికి గానీ, కనీస స్థలం కూడా లేదని, అలాగే విద్యుత్ వ్యవస్థ, నీటి వ్యవస్థ కూడా లేదు. కనీస మౌలిక సదుపాయాలు లేకుండానే మదర్సాలు నడుస్తున్నాయి. ఢక్రానీలోని వార్డ్ నంబర్ 11లో పరిపాలనా అనుమతి లేకుండా నిర్మిస్తున్న అబ్దుల్ బాసిత్ హడిసన్ మసీదును కూడా అడ్మినిస్ట్రేటివ్ టీమ్ సీల్ చేసింది.
మరోవైపు అక్రమంగా నడుస్తున్న ఈ మదర్సాలకు అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిధులు అందిస్తున్న వారు ఎవరు అన్న దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై విచారణకు కూడా సిద్ధమైంది. అక్రమ మసీదులపై చర్యలకు ఉపక్రమించాలని, అక్రమ మదర్సాలు నడుస్తున్నాయని సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫిర్యాదులు అందాయి.