భారతీయ జ్ఞాన పరంపర పునరుద్ధరణ జరగాలి : నంద కుమార్

VSK Telangana    04-Mar-2025
Total Views |
 
NANDA KUMAR
 
భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని ప్రజ్ఞప్రవాహ్ జాతీయ సంయోజక్ నంద కుమార్ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా విద్య వుండాలని, అలాంటి లక్ష్యమున్న ఉపాధ్యాయులను తీర్చిదిద్దడానికి విద్యా వ్యవస్ధ అత్యావశ్యకమని నొక్కి చెప్పారు.అఖిల భారతీయ శైక్షణిక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నంద కుమార్ ప్రసంగించారు.
 
ఈ సందర్భంగా నంద కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు అన్న కేంద్రంగా వుండే విద్యావ్యవస్థ వుండాలని, కానీ... రానూ రానూ అది నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. ఈ దేశంపై దాడి చేసిన ఆక్రమణదారులు కేవలం భూభాగాన్ని మాత్రమే ఆక్రమించాలనుకునేవారు కాదని, విద్యా కేంద్రాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను కూల్చేసే కుట్రలు కూడా చేశారన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా, వలసవాద శక్తులు రూపొందించిన సిలబస్ నే ఇంకా అనుసరిస్తున్నామన్నారు.
 
భారతీయ మూలాలున్న విద్యా వ్యవస్థను కూల్చేసి, దాని స్థానంలో సాంస్కృతిక మార్క్సిజాన్ని తీసుకురావడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని నంద కుమార్ హెచ్చరించారు. భారతీయ సంప్రదాయాలను, ఆచారాలను అవమానించే, ఖండించే ధోరణి పెరుగుతోందని, చివరికి కుంభమేళాను కూడా విమర్శించారని మండిపడ్డారు. కుంభమేళా కోసం ప్రయాగరాజ్ కి ప్రయాణించే ప్రయాణికులకు ఆతిథ్యమివ్వని ఏకైక రాష్ట్రం కేరళ అని విరుచుకుపడ్డారు.
 
 
వలసవాద శక్తులు తమ పాలనలో మన సంస్కృతిని విషపూరితం చేశాయని, ఆ వక్రీకరణలే ఇప్పటికీ విద్యా వ్యవస్థలో వున్నాయన్నారు. స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో మన విద్యా వ్యవస్థలో దిద్దుబాట్లు అవసరమయ్యాయని, కానీ... పాలకులు వాటిని అమలు చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదని విమర్శించారు.మనం ఇప్పుడు భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని, దీనికి జాతీయ విద్యా విధానం (NEP) సరైన దిశ, సరైన అడుగు అని నంద కుమార్ అభిప్రాయపడ్డారు.