గురూజీ తత్వశాస్త్రానికి నేటికీ ఎంతో ప్రాముఖ్యత వుంది : సునీల్ అంబేకర్

VSK Telangana    04-Mar-2025
Total Views |

guruji book release
 
నవయుగ భారతి ఆధ్వర్యంలో ‘‘శ్రీ గురూజీ దృష్టి- దార్శనికత’’ అన్న పుస్తకావిష్కరణ కేశవ మెమోరియల్ విద్యా సంస్ధలోని పటేల్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, విశిష్ట అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య వెలుదండ నిత్యానంద రావు హాజరయ్యారు. ఇదే సందర్భంలో ఎస్. గురుమూర్తి రచించిన గోల్వాల్కర్: ది మోడ్రన్ ఋషి విత్ ఎ మిల్లేనియల్ విజన్" అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.
 
ఈ పుస్తకాన్ని జ్యేష్ఠ ప్రచారకులు రాంపల్లి మల్లికార్జున రావు పరిచయం చేశారు. నవ యుగ భారతి పక్షాన సిద్ధాంతపరమైన పుస్తకాలు, చరిత్ర పరమైన పుస్తకాలు, మహా పురుషుల చరిత్రకి సంబంధించిన పుస్తకాలు కూడా ప్రచురితం చేసిందని తెలిపారు. ఆరెస్సెస్ శత జయంతి ఉత్సవాలకు చేరువవుతున్న సందర్భంగా సంఘ సైద్ధాంతిక పరమైన పుస్తకాలను తీసుకురావాలని సంకల్పించామని తెలిపారు. తాజాగా శ్రీ గురూజీ దృష్టి దార్శనికత అనే పుస్తకం తీసుకొచ్చామని తెలిపారు. దీనిని వేదుల నరసింహం గారు తెలుగులోకి అనువాదం చేశారన్నారు. అంతే ప్రయత్నం వడ్డి విజయసారథి గారు కూడా చేశారన్నారు.
 
కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన ఆచార్య వెలుదండ నిత్యానందరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతి, ఈ పుస్తకాన్ని తెలుగులోకి తీసుకురావడంలో నవయుగ భారతి చేసిన కృషిని ప్రశంసించారు. “ఇలాంటి లోతైన ఆలోచనలు భాషా పరిమితులను దాటి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ గ్రంథం పరిశోధకులకు, యువతకు, శ్రీ గురూజీ అభిప్రాయాలను అర్థం చేసుకునే గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
 

Guruji Book Vedula 
 
ఇక.. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసిన సీనియర్ పాత్రికేయులు వేదుల నరసింహం మాట్లాడుతూ గురూజీ ఓ తపస్వి అని, రుషితుల్యులని అభివర్ణించారు. సామాన్య కార్యకర్త మొదలు మేధావులకు, ధర్మాచార్యులకు కూడా మార్గదర్శనం చేయగల మేధో సంపన్నుడు అని అన్నారు. డాక్టర్జీ సంఘ్ ని ప్రారంభించి, హిందూ రాష్ట్ర వాదానికి ప్రాచుర్యం కలిపిస్తే.. దానికి తాత్వికతను, సైద్ధాంతపరమైన భూమికను అందజేసింది గురూజీ అని అన్నారు. ఆయన సరసంఘచాలక్ గా వున్న సమయంలో దేశ వ్యాప్తంగా పర్యటించారన్నారు. 1972 లో హైదరాబాద్ లోనే శిక్షావర్గ జరిగిందని, తమకు వారి ప్రత్యక్ష మార్గదర్శనం పొందే అదృష్టం కలిగిందన్నారు.
 
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ ప్రసంగిస్తూ శ్రీ గురూజీ యొక్క జాతీయ ఏకతా, నిస్వార్థ సేవ సిద్ధాంతాలను వివరించారు.
 
‘‘గురూజీ చిన్న వయస్సులోనే సరసంఘచాలక్ బాధ్యతలు నిర్వర్తించారు. 34 ఏళ్ల వయస్సులోనే గురూజీకి డాక్టర్జీ  గురుతర బాధ్యతలు అప్పజెప్పారు. ఆ సమయంలో దేశం విదేశీయుల పాలనలో వుండేది. సంఘానికి కూడా అనుకూల సమయం కాదు. అప్పటి రాజకీయాల్లో హిందూ అన్న శబ్దం అంత ప్రాచుర్యంలో వుండేది కాదు. దేశాన్ని మన దేశం విదేశీ పాలనలో ఉన్న సమయంలో ‘హిందూ’ అనే పదాన్ని బహిరంగంగా వాడటం చాలా సవాల్‌గా మారింది. మదన్ మోహన్ మాలవ్య గారు కూడా ‘హిందూ’ అనే పదాన్ని వివిధ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి వచ్చేది. ఆ రోజుల్లో జాతీయత అంటే హిందూ, ముస్లింల గురించి మాట్లాడినప్పుడే గుర్తింపు ఉండేది. అలాంటి సమయంలోనే గురూజీ "ఇది హిందూ రాష్ట్రమే" అని ధైర్యంగా ప్రకటించారు.
 
ముస్లింలు ఉర్దూ సాహిత్యం, వ్యాసాలు రాసే సమయంలోనూ మన దేశాన్ని హిందుస్థాన్ అనే సంబోధించేవారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత రాజకీయ స్వరూపం మారిపోయింది. హిందు ముస్లిం సంబంధం విషయంలో గంగా జమునా అంటూ ప్రచారం చేశారు. కావాలనే ఇలా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత సోషలిస్టు అన్న పదం కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి పదబంధం వాడటం ఓ ఫ్యాషన్ అయిపోయింది. సామాన్యులు కూడా ఇలాగే వాడటం ప్రారంభించారు. అప్పుడే హిందూ అన్న శబ్ద ప్రవాహం కూడా విరివిగా ప్రారంభమైంది.
 

Guruji Book audience 
 
స్వామి వివేకానంద 1893లో చికాగో వెళ్లి హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. అప్పుడే హిందుత్వం గురించి మళ్లీ అందరూ ఆలోచించాల్సిన సందర్భం, సమయం వచ్చింది. హిందుత్వం అన్న పునాదిని పట్టుకొని ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. సరిగ్గా ఆ సమయంలోనే దేశ స్వాతంత్రం కోసం ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి. అప్పుడే అసలు మనం ఎవరం? మన పునాదులు ఏమిటి? అన్న చర్చ కూడా ప్రారంభమైంది. మన పరిచయం ఏమిటి? మన విశేషత ఏమిటి? అన్న చర్చ సమాజంలో ప్రారంభమైంది. ఈ చర్చ నడుస్తున్న సందర్భంలోనే డాక్టర్జీ ఆరెస్సెస్ అనే సంఘటనను ప్రారంభించారు.
 
అప్పటి రాజకీయాలు, పరిస్థితులు అన్నీ డాక్టర్జీ లోతుగా చూశారు. అధ్యయనం చేశారు. తదనంతరం ఇది హిందూ రాష్ట్రం.. నేను చెబుతున్నాను కదా’’ అని డాక్టర్జీ ప్రకటించారు. ప్రారంభం నుంచే ఈ భావనను తీసుకొనే సంఘ ప్రయాణం ప్రారంభమైంది. దీనికి సమాంతరంగా హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తులను వెతకడం కూడా డాక్టర్జీ ప్రారంభించారు. అలాగే సంఘ్ ని నడిపించేవారు, సమాజానికి మార్గదర్శనం చేసే వారు, సంఘ విచార ధారను అర్థం చేసుకునేవారు, స్వయంసేవకులను తయారు చేసేవారు, దేశంలో నడుస్తున్న చర్చకి సరైన దిశ ఇచ్చే వారి కోసం డాక్టర్జీ నిరంతరం వెతకడం ప్రారంభించారు. ఈ సమయంలోనే డాక్టర్జీకి మాధవ రావు సదాశివరావు గోళ్వాల్కర్ తటస్థించారు. ఆ సమయంలో గోళ్వాల్కర్ కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యా బోధన చేసేవారు. అక్కడ చదువు చెప్పే వారిని గురూజీ అని సంబోధించడం అలవాటు. అప్పటి నుంచే గోల్వాల్కర్ ని గురూజీ అని పిలవడం తటస్థించింది. చివరి వరకు వారిని గురూజీ అనే సంబోధించేవారం.
 
 
Guruji Book Sunil Ambekar
 
ఎలాంటి వ్యక్తుల కోసం డాక్టర్జీ వెతకడం ప్రారంభించారో... గురూజీ దగ్గరికి వచ్చే సరికి అది పూర్తైంది. దాని తర్వాత రెండో సరసంఘచాలక్ అన్న గురుతర బాధ్యతను డాక్టర్జీ గురూజీకి అప్పజెప్పారు. గురూజీ జీవనం మొత్తం అందరికీ సదా ప్రేరణాదాయకమే. అత్యంత ప్రభావవంతమైన జీవితం కూడా. పైగా సన్యాస జీవితం. బుద్ధి అత్యంత ప్రగాఢమైంది. జ్ఞాపక శక్తి కూడా అమోఘమైంది. వ్యక్తిత్వం కూడా అద్భుతమైంది.వర్ణనాతీతం. ఒక్క మాటలో ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాలనుకుంటే.. దేశ కార్యంలో తనని తాను సమర్పితం చేసేంత వ్యక్తిత్వం ఆయనది. ఆయన దగ్గరున్నదంతా అది దేశం కోసమే సమర్పితం చేయాలని నిర్ణయించేసుకున్నారు.
 
దేశ విభజనకు ముందు గురూజీ కరాచీలో వున్నారు. జరుగుతున్న సంఘటనలన్నింటినీ ఓ వ్యూహకర్తలా ఓ కంట కనిపెడుతూనే వున్నారు. నిశితంగా గమనిస్తున్నారు. 1962 నాటికి రాబోయే ప్రమాదాలను ఆయన ముందుగానే ఊహించారు. ఆయన ఆంతర దృష్టి ఇప్పటి సంఘటనలకూ సరిపోయేంత తీక్షణమైనది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. భారత్ లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే అని గురూజీ విశ్వసించారు. రాజ్యాంగ విషయాలు, జాతీయ విధానాలు, పాలనపై అత్యంత వివరణాత్మక మార్గదర్శనం అందించారు. ఆయన ఆలోచనలు ఆ కాలానికి సంబంధించినవి కానీ... చాలా వరకు ఆ ఆలోచనలు కాలాతీతమైనవే. మనకు ఆలోచనలను రేకెత్తించేవే.
 
గురూజీకి సంబంధించి ముఖ్యమైన ఆందోళనలో చైనా ఒకటి. చైనా విషయంలో గురూజీ పదే పదే హెచ్చరించేవారు. దాని దురాక్రమణ కేవల ప్రాదేశికమైనదే కాదు అని చెప్పేవారు. భారత్ పట్ల దాని సైద్ధాంతిక వైఖరి లోతుగా పాతుకుపోయేదని కూడా చెప్పేవారు. కేవలం విస్తరణవాద శక్తి మాత్రమే కాదని, భారత్ కి సైద్ధాంతిక ముప్పు అని చెప్పేవారు. అయితే... ఈ ఆలోచనలు రాత్రికి రాత్రే రాలేదు. లోతైన అవగాహన, దార్శనికతతో సాధ్యమైంది. జాతీయ భద్రత విషయంలో ఆయనకున్న స్పష్టమైన వైఖరి అచంచలమైనది. క్లిష్ట సమయాల్లో ప్రభుత్వంతో కలిసి నిలబడాలని, సాయుధ దళాలకు మద్దతివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
విభజన విషయంలో గురూజీ ఎప్పుడూ రాజీపడలేదు. దేశానికి ఏది మంచిదో జమ్మూ కశ్మీర్ మహారాజాకు వివరించేవారు. భారత సమగ్రతకే గురూజీ అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. ఆయన అభిప్రాయాలు ఎప్పుడూ మనకు మార్గదర్శకాలే.
 

Guruji Book audience 
 
విశ్వహిందూ పరిషత్ స్థాపించిన సమయంలో హిందూ ఏకతా కోసం పిలుపునిచ్చారు. ఆయన అయోధ్య అంశాన్ని హిందువుల ఐక్యతకు సూచికగా భావించారు. ధర్మ మార్పిడులు దేశ విభజనకు దారితీస్తాయని హెచ్చరించారు. "మీరు ఆరాధనా విధానాన్ని మార్చుకోవచ్చు, కానీ మీ జాతీయతను మార్చలేరు" అని ఆయన స్పష్టంగా చెప్పారు. శ్రీ గురూజీ యొక్క తత్వశాస్త్రం నేటికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆయన మార్గదర్శనం ఆర్‌ఎస్‌ఎస్ యొక్క సిద్ధాంత చట్రాన్ని నిర్మించడంలో కీలకమైనది. ఈ గ్రంథం ఆయన ఆలోచనలను సమర్థంగా అర్థం చేసుకోవడానికి మార్గదర్శిగా నిలుస్తుంది’’ అని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.
 
 
శ్రీ గురూజీ దృష్టి – దార్శనికత పుస్తకాన్ని జ్యేష్ఠ ప్రచారకులు రాంపల్లి మల్లికార్జున రావు పరిచయం చేశారు. నవయుగ భారతి పక్షాన సిద్ధాంతపరమైన పుస్తకాలు, చరిత్రపరమైన పుస్తకాలు, మహా పురుషుల చరిత్రకి సంబంధించిన పుస్తకాలు కూడా ప్రచురితం చేసిందని తెలిపారు. ఆరెస్సెస్ శత జయంతి ఉత్సవాలకు చేరువవుతున్న సందర్భంగా సంఘ సైద్ధాంతిక పరమైన పుస్తకాలను తీసుకురావాలని సంకల్పించామని తెలిపారు. తాజాగా శ్రీ గురూజీ దృష్టి దార్శనికత అనే పుస్తకం తీసుకొచ్చామని తెలిపారు. దీనిని వేదుల నరసింహం గారు తెలుగులోకి అనువాదం చేశారన్నారు. అంతే ప్రయత్నం వడ్డి విజయసారథి గారు కూడా చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో నవయుగ భారతి సభ్యుడు శ్రీ రాంపల్లి మల్లికార్జున్ గారు హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జాతీయతను ప్రోత్సహించే ఆలోచనలు ప్రాంతీయ భాషల్లో విస్తరించాలనే అవసరాన్ని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమానికి నవయుగ భారతి కార్యదర్శి నేతి క్షీరసాగర్ అధ్యక్షత వహించగా, ఆర్ఎస్ఎస్ ప్రాంత సంచాలకులు సుందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు.
శ్రీ గురూజీ దార్శనికతను లోతుగా అర్థం చేసుకోవాలనుకునే వారికి ఈ గ్రంథం అందుబాటులో ఉంది.