బొట్టు ధరించినందుకు విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్

VSK Telangana    05-Mar-2025
Total Views |
 
SCHOOL
 
ఓ విద్యార్థి బొట్టు పెట్టుకున్నాడని స్కూల్ యాజమాన్యం విపరీతంగా కొట్టి, తన రాక్షసత్వాన్ని బయటపెట్టింది. ఈ ఘోరం జరిగింది హయత్ నగర్ లోని CANDOR SHRINE అనే పాఠశాలలో. బొట్టు పెట్టుకున్నందుకు ఘోరంగా దెబ్బలు తిన్న విద్యార్థి తనకు ఎదురైన అనుభవాన్ని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కుంకుమ ధరించి, స్కూల్ కి వెళ్లితే, తన ప్రిన్సిపాల్ లక్ష్మయ్య తీవ్రంగా కొట్టి, బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి మరీ బలవంతంగా బొట్టు తుడిపించారని వెల్లడించారు. తరగతి గదిలో ఎవ్వరు బొట్టు పెట్టుకున్నా... సహించరని, బొట్టు తీసేంత వరకూ టార్చర్ పెడుతూనే వుంటారని అబ్బాయి వెల్లడించారు. ‘‘బొట్టు ఎందుకు పెట్టుకున్నావ్ రా... పోయి కడుక్కో’’ అంటూ ప్రిన్సిపాల్ తీవ్రంగా కొట్టారని విద్యార్థి వెల్లడించాడు.
 
‘‘ఉదయం నేను బొట్టు పెట్టుకొని స్కూల్ కి వెళ్లా. అసెంబ్లీ తర్వాత..అందర్నీ చెక్ చేస్తూ వచ్చాడు ప్రిన్సిపాల్. ఏందిరా బొట్టు పెట్టుకున్నావ్.. రా.. అని బెదిరించాడు. కొట్టాడు. వెంటనే కడుక్కోపో... అంటూ బాత్ రూమ్ వరకు లాక్కెళ్లాడు. క్లాస్ లో ఎవ్వరు బొట్టు పెట్టుకున్నా... బెదిరిస్తాడు.’’ అని విద్యార్థి వెల్లడించారు.
 
 
మరోవైపు విద్యార్థి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో తల్లిదండ్రులు, హిందూ సంఘాల నేతలు ఈ స్కూల్ కి వెళ్లి, యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠశాలలోనే నిరసనకు దిగారు. బొట్టు పెట్టుకున్న ప్రతి విద్యార్థిని కూడా ప్రిన్సిపాల్ లక్ష్మయ్య కొడుతున్నాడని, అలాగే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పాఠాలు చెబుతున్నాడని హిందూ సంఘాల నేతలు వెల్లడించారు. ఇలా దాదాపు పది మంది పోషకులు కంప్లైట్స్ ఇచ్చారని తెలిపారు. ప్రతి పోషకునిలో అవగాహన తీసుకొచ్చి, పాఠశాలపై ఫిర్యాదు ఇచ్చి, పాఠశాలను మూసేయిస్తామని హిందూ సంఘాల నేతలు ప్రకటించారు. మరోవైపు ప్రిన్సిపాల్ అడ్డంగా బుక్కైపోవడంతో యాజమాన్యం ఆయన్ని విధుల నుంచి తొలగించింది.