( ఏప్రిల్ 10 – శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వామి జయంతి)
భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత. మానవుడిని మహనీయుడిగా మార్చగల అద్భుత శక్తి భగవద్గీతకు ఉంది. అందుకే, ఈ విశ్వఖనిలో నేటి వరకూ లభించిన జ్ఞానమణులలో అమూల్యమైనదిగా చెప్పుకునే భగవద్గీత పట్ల శంకరాచార్యుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఆసక్తి కలిగి ఉన్నారు. ఎంతో విశాలార్థం, అగాధ భావం, సమత్వమున్న భగవద్గీతకు భాష్యం రాసిన సుప్రసిద్ధ గురువులలో ఒకరు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములు. తెలుగునాట కాళహస్తి స్వామిగా ప్రసిద్ధి చెందిన విద్యాప్రకాశనందగిరి స్వామి తన గీతామకరందం ద్వారా ఎందరిలోనో జ్ఞానజ్యోతిని వెలిగించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రసాదించిన భగవద్గీత సారాంశాన్ని తన ప్రసంగాల బోధిస్తూ తన పరిపూర్ణ జీవితాన్ని మానవాళి శ్రేయస్సుకే అంకితం చేసిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాముల వర్థంతిని ఏప్రిల్ 10న నిర్వహించుకుంటున్నాము.
శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాముల వారు తన గీతా ప్రవచనాల ద్వారా సమాజంలో ధార్మిక, ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించడమే కాదు అసమానతలపై, మూఢ విశ్వాసాలపై పోరాడారు. పేదల పక్షపాతిగా నిలుస్తూ విద్యా, వైద్య సేవలను అందించి సమాజోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన భారతీయ ఆధ్యాత్మిక గురువులు. శ్రీ కాళహస్తిలో శ్రీ శుకబ్రహ్మాశ్రమం స్థాపకులు, వేదాంతభేరి వ్యవస్థాపకులు అయిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాముల వారు ఆనంద నామ సంవత్సరం చైత్ర బహుళ తదియ నాడు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 13, 1914న బందరులో జన్మించారు. వీరి తల్లి పేరు సుశీలా దేవి, తండ్రి పేరు రామస్వామి. తల్లిదండ్రులు విద్యాప్రకాశనందగిరి స్వాములవారికి పెట్టిన పేరు ఆనంద మోహన్. శిష్టాచార సంపన్నులైన రామస్వామి దంపతుల నీడలో పెరిగిన ఆనంద మోహన్‌కు పసితనం నుంచే దైవభక్తి మెండుగా ఉండేది. ఆనందుడి చదువు అందరిలానే సాధారణంగా సాగింది. మెట్రిక్యులేషన్ వరకు విజయవాడలో చదివాడు. మచిలీపట్నంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత విద్యను వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అభ్యసించాడు. హిందీ, ఇంగ్లీషు భాషలపై ఆనందుడికి ఎంతో పట్టు ఉంది. కాశీ విద్యా పీఠంలో ఉండగా అక్కడి విద్యార్థులు నడిపే ఇంగ్లీషు మాసపత్రికకు అలాగే తపోభూమి అనే హిందీ పత్రికకు ఆనందుడు సంపాదకునిగా వ్యవహరించాడు.
గీతా సారాన్ని అందరికీ చేరవేయాలని సంకల్పించిన ఆనందుడు 1936 మే 17న ఆశ్రమ ప్రవేశం చేశాడు. శ్రీ సద్గురు మళయాళ స్వామి సన్నిధిలో 12 సంవత్సరాలు తపస్సాధన చేశాడు. ఈ సమయంలో ఆయన అనేక గ్రంథాలను రచించారు. యోగవాసిష్ఠం, ధర్మపథం అనువాదాలతో పాటు మళయాళ స్వామి దివ్యప్రబోధాలను గ్రంథస్థం చేశారు. శిష్యుని ప్రతిభకు మెచ్చి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి సన్యాస స్వీకారానికి ఏర్పాటు చేసిన మలయాళ స్వామి గిరి సంప్రదాయానుసారంగా ఆనందుడికి శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వామి అని నామకరణం చేశారు. సన్యాసం స్వీకరించిన మూడు సంవత్సరాలకు శ్రీ విద్యా ప్రకాశనందగిరి స్వాములవారు శ్రీకాళహస్తిలో శ్రీ శుకబ్రహ్మాశ్రమాన్ని స్థాపించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. శ్రీ మళయాళ స్వాముల వారి అనుజ్ఞతో 1957 నుంచి గీతాజ్ఞాన యజ్ఞాలను శ్రీ విద్యా ప్రకాశనందగిరి స్వాముల వారు దేశవ్యాప్తంగా ప్రారంభించి ప్రజలను ఆధ్యాత్మికత దిశగా నడిపించారు. ఇదే సమయంలో వేదాంతభేరి అనే ఆధ్యాత్మిక మానపత్రిక ద్వారా వేదాంతపరమైన వివరణలు ఇచ్చారు. అలాగే గీతామకరందం అనే గ్రంథాన్ని వెలువరించారు. పలు పత్రికలకు ఆయన రాసిన పరమార్థ కథలు సామాన్యులు సైతం అర్థం చేసుకోగల సులభశైలిలో ఉండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేశాయి.
విద్యాప్రకాశనందగిరి స్వాముల వారు వేదాంత కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విస్తృత స్థాయిలో నిర్వహించారు. పేదల కోసం విద్యాలయాలు, వైద్యాలయాలను స్థాపించారు. సరైన ఆధ్యాత్మిక బోధన లేకపోవడం వలనే యువత తప్పుదారి పడుతోందని, వారికి భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం కలిగించాలని స్వామివారంటారు. స్వీయధర్మం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయని, స్వీయ ధర్మాన్ని తెలియజేసి తగిన సదుపాయాలు కలుగ జేస్తే మరొక మతం మారాల్సిన అవసరం రాదని ఆయన అంటారు. జాతి, మత, కుల, వర్గ, భాషా విభేదాలు మనం సృష్టించుకున్నవే, అధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రచారం చేయడం ద్వారా శాంతి, సుఖం, ఆనందం ఏర్పడతాయని శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములవారు సందేశం ఇచ్చారు. మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ గీతాజ్ఞాన యజ్ఞానికి తన జీవితాన్ని సమర్పించిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాముల వారు మనకు ఆత్మజ్ఞాన మార్గదర్శకులు.