విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముస్తాబవుతున్న అయోధ్య

VSK Telangana    11-Apr-2025
Total Views |
 
Ayodhya ram idol
 

శ్రీరామచంద్రస్వామి వారి జన్మస్థలమైన అయోధ్య మరో ఉత్సవానికి ముస్తాబైంది. గత ఏడాది జనవరి 22న జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ తరువాత ఇప్పుడు మందిర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తాజాగా అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఏడాది మే లో ఆలయంలోని మరికొన్ని విగ్రహాల ప్రతిష్ఠాపన జరగనుంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనుంది.

ప్రస్తుతం మందిర నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాది చివరి నాటికి పూర్తి కావచ్చు అని ట్రస్ట్ సభ్యుల అంచనా . రామ మందిరాన్ని మూడు అంతస్తులతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం మాత్రమే పూర్తి అయింది. మిగిలిన రెండు అంతస్తులతో పాటు శిఖర నిర్మాణం జరుగుతోంది.

మే నెలలో ఆలయ సముదాయంలోని ఇతర దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన తో పాటు దశావతారం, శేషావతారం, నిషాదరాజు, శబరి, అహల్య, తులసీదాస్ తదితర మహనీయులకు విగ్రహాల ప్రతిష్టాపన జరగనుంది. 18 నూతన మందిరాల నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది. మే నెలలో జరిగే కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం.