హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అయోధ్య రామాలయం ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ మెయిల్‌లో రామాలయ భద్రత గురించి ట్రస్ట్‌కు హెచ్చరికలు పంపారు. దీంతో ట్రస్ట్ అప్రమత్తమైంది. మరోవైపు యూపీ పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగి, దర్యాప్తును ప్రారంభించారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు?అన్న విషయాలపై దర్యాప్తును ప్రారంభించారు.
అయితే ఈ మెయిల్ తమిళనాడుకి సంబంధించిన ఓ వ్యక్తి నుంచి వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. అయితే దీనిపై ట్రస్ట్ మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆదివారం అర్థరాత్రి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే.. అశాంతిని రేకెత్తించడానికి, హిందూ సమాజంలో గందరగోళం, భీతిని వ్యాప్తి చేయడంలో భాగంగానే ఇలాంటి కుట్రులు జరుగుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. మరోవైపు రామ జన్మభూమి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పటి వరకైతే పోలీసులు పరిమిత వివరాలను మాత్రమే వెల్లడించారు. లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారు.
మరోవైపు అయోధ్య బాలరాముడ్ని దర్శించుకోవడానికి రోజు రోజుకీ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెయిల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అదనంగా 3 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
అయితే, అయోధ్య రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా ఆలయంపై దాడి చేస్తామని అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. అంతకుముందు 2024 సెప్టెంబర్‌లో కూడా రామాలయంపై బాంబు దాడి చేస్తామని బెదిరింపు వచ్చింది. అయినా హిందువులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బాలరాముడ్ని దర్శించుకోవడానికి అయోధ్యకి వెళ్తూనే వున్నారు.