వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ లో జరుగుతున్న హింసను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం అక్కడి హిందువులను సంరక్షించడంలో పూర్తిగా విఫలమైందని VHP జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మిలింద్ పరాండే మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే అన్ని వర్గాలనూ కాపాడాల్సిన గురుతర బాధ్యత వుంటుందని, అన్ని వర్గాలకు చెందిందన్నారు. వేలాది మంది హిందువులు తమ ఇళ్లను వదిలి వెళ్తున్నారని, ఇది అత్యంత దురుదృష్టకరమని అన్నారు.
‘‘బెంగాల్ లో జరుగుతున్న హింస ఖండించదగిందే. రాష్ట్ర ప్రభుత్వం హిందువులను రక్షించడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే అన్ని వర్గాలకు చెందింది. కానీ.. ఈ భావనతో అక్కడి ప్రభుత్వం లేదన్నది నా భావన. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తే.. ఇంతకంటే దురదృష్ట ఘటన మరొక్కటి వుండదు’’ అని మిలింద్ పరాండే అన్నారు.
తన విధి నిర్వహణలో మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిని అతి తక్కువ చేసి చూస్తోందన్నారు. దీనిని హిందూ సమాజం కచ్చితంగా ఆలోచించాలన్నారు. నిరసనలు వ్యక్తం చేస్తామని కొందరు ప్రకటించారని, చేస్తే చేసుకోండి కానీ... హిందువులపై ఎందుకు దాడులు చేస్తున్నారని పరాండే ప్రశ్నించారు.
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేయాలన్నా, వ్యతిరేక వాదనలు వినిపించాల్సి వస్తే.. వాటికి, హిందువులపై దాడులకు వున్న సంబంధమేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హింసా కాండ అంతా ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరుగుతోందని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావన్న హామీని ప్రభుత్వం హిందూ సమాజానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.