వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్‌లో భారీ హింస జరుగుతోంది. ఈ సందర్భంలో చాలా మంది హిందువులపై దాడులు కూడా జరుగుతున్నాయి. ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని.. హిందువులు వలసలు వెళ్లిపోతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు, వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాత్రం ఈ సంఘటనను, హిందువుల కష్టాలను అత్యంత సాధారణంగా తీసుకుంటూ కామెంట్లు చేశారు.
‘‘వారు బెంగాల్‌లోనే ఇతర ప్రాంతాలకు మాత్రమే వెళ్తున్నారు. మొత్తం రాష్ట్రాన్నే విడిచి వెళ్లిపోవడం లేదు కదా. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. హింస దురదృష్టకరం. హింసకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసు శాఖ వుంది. అంటూ హిందువుల కష్టాలను తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేశారు.
గుజరాత్‌లో చాలా పెద్ద ఘటనే జరిగిందని, ఆ ఘటన తర్వాత కూడా ప్రభుత్వం మొత్తం మౌనంగా వుండిపోయింది అంటూ ఫిర్హాద్ హకీమ్ తప్పించుకునే ప్రయత్నాలు చేశారు.
బెంగాల్‌లో హిందువులే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముర్షీదాబాద్ తో సహా తదితర ప్రాంతాల్లో నిరసన కాస్తా… హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇవి హిందువులే టార్గెట్ గా జరుగుతున్నాయని, దాదాపు 400 మందికి పైగా హిందువులు ఇళ్ల నుంచి బయటకు పంపినట్లు బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేర్కొంటున్నారు. అలాగే హిందువులు మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఇదంతా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలతోనే వచ్చిందని మండిపడ్డారు. ఈ బుజ్జగింపు రాజకీయాలను అడ్డంపెట్టుకొనే మూకలు చెలరేగిపోతున్నాయన్నారు. మతోన్మాదులకు భయపడి ముర్షిదాబాద్‌లోని ధులియన్ అనే ప్రాంతం నుంచి 400 మందికి పైగా హిందువులు పడవలో గంగానది మీదుగా వెళ్లిపోయారని, డియోనాపూర్, బైస్నాబ్ నగర్, మాల్డాలో ఆశ్రయం పొందుతున్నారన్నారు.
ఈ సందర్భంగా సుబేందు అధికారి తన సోషల్ మీడియాలో బాధితులకి సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేశారు. ‘‘నా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కూడా సహాయం ఏమీ చేయలేదు. సింపుల్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు.’’ అంటూ ఓ హిందువు వాపోయిన వీడియోను పోస్ట్ చేశారు.