హురియత్‌తో తెగతెంపులు చేసుకున్న మరో వేర్పాటువాద గ్రూపు

VSK Telangana    15-Apr-2025
Total Views |
 
Jammu and Ladak
 

జమ్మూ & కాశ్మీర్ మాస్ మూవ్‌మెంట్ చైర్‌పర్సన్ ఫరీదా బెహన్ జీ ఒక బహిరంగ ప్రకటనలో కాశ్మీర్‌లో పనిచేస్తున్న వేర్పాటువాద సమ్మేళనాల నుండి తనను, తన సంస్థను వేరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ రెండు వర్గాలు ఉన్నాయి. తనకు లేదా తన సంస్థకు హరియత్ గ్రూపులు లేదా వేర్పాటువాద లేదా ఇలాంటి అజెండాలను అనుసరిస్తున్న మరే ఇతర సమూహంతోనూ ఎటువంటి సంబంధం లేదా అనుబంధం లేదని స్పష్టం చేశారు.

హరియాధ్ తమ పార్టీతో ప్రతిధ్వనించదని ఆమె స్పష్టం చేసింది. అటువంటి వేదికలు జమ్మూ కాశ్మీర్ ప్రజల చట్టబద్ధమైన ఆకాంక్షలు, మనోవేదనలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నారు. “నేను భారతదేశానికి నమ్మకమైన పౌరురాలిని” అని ఆమె ధృవీకరించారు. తాము భారత రాజ్యాంగానికి విధేయత చూపుతాయని, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ సమూహంతోనూ సంబంధం లేదని వెల్లడించారు.

జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని తిరస్కరిస్తూ హరియత్ కాన్ఫరెన్స్‌ తో మరో గ్రూపు తెగతెంపులు చేసుకోవడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హర్షం ప్రకటించారు. ”మోదీ నాయకత్వంలో ఐక్యతా స్ఫూర్తి జమ్మూకశ్మీర్‌లో పరిఢవిల్లుతోంది. హురియత్ మరో అనుబంధ సంస్థ జమ్మూకశ్మీర్ మాస్ మూవ్‌మెంట్ సైతం వేర్పాటువాదాన్ని ఖండించింది. ఐక్య భారత్‌కు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. హృదయపూర్వకంగా వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను” అని తెలిపారు.

దీంతో ఇంతవరకూ వేర్పాటువాదానికి దూరంగా జరుగుతూ, భారత రాజ్యాంగానికి విధేయత ప్రకటించిన హురియుత్‌ అనుబంధ సంస్థల సంఖ్య 12కు చేరిందని అమిత్‌షా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు.వేర్పాటువాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై ప్రభుత్వంపై అవిశ్రాంతంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో హురియత్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఏప్రిల్ 8న హురియత్‌ కాన్ఫరెన్స్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్టు జమ్మూ కశ్మీర్ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ, జమ్మూ అండ్ కశ్మీర్ ముస్లిం డెమోక్రటిక్ లీగ్, కశ్మీర్ ఫ్రీడం ఫ్రంట్‌లు ప్రకటించాయి.

కాగా, దీనికి ముందు మార్చి 25న జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జేకేపీఎం), జమ్మూ అండ్ కశ్మీర్ డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్‌మెంట్ (జేకేడీపీఎం)లు వేర్పాటువాదాన్ని వీడుతున్నట్టు ప్రకటించాయి. ఆ తర్వాత రెండ్రోజులకు తెహ్రిక్-ఇ-ఇస్తెఖ్‌లాల్, తెహ్రిక్-ఇ-ఇస్తిఖ్ గ్రూపులు హురియత్‌తో తెగతెంపులు చేసుకున్నాయి.