ఇబాదత్‌ఖానా అంశంలో తెలంగాణ వక్ఫ్ బోర్డుపై హైకోర్టు సీరియస్

VSK Telangana    07-Apr-2025
Total Views |
 
Waqf Bill In Telangana high Court
 

వక్ఫ్ బోర్డు వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ఫ్ బోర్డు విస్మరించిందని జస్టిస్ నగేశ్ భీమపాక వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డుపై గత సంవత్సరం హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి విచారణ సందర్భంగా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇబాదత్‌ఖానాను స్వాధీనం చేసుకోవాలని గత సంవత్సరం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాని నిర్వహణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం అప్పుడు ఆదేశించింది.

తాజాగా జరిగిన విచారణలో, మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు పేదల పక్షాన పనిచేయడం లేదని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ నగేశ్ భీమపాక దివ్య ఖురాన్‌లోని కొన్ని భాగాలను ఉటంకించారు. పాదరక్షలు విడిచి, ఆయన అందులోని అంశాలను చదివి వినిపించారు. అదే సమయంలో, ఖురాన్ స్ఫూర్తిని విస్మరించారంటూ పిటిషనర్‌పై కూడా అసహనం వ్యక్తం చేశారు.